- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Silver : రూ. 4 లక్షలకు చేరువైన వెండి
అమెరికా కరెన్సీ డాలర్ పతనం కావడంతో బంగారం కూడా పది గ్రాములు రూ. 1.65 లక్షలతో చారిత్రాత్మక స్థాయిలకు దూసుకెళ్లింది.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండి ధరల్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మొగ్గుచూపుతుండటంతో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం వెండి ధరలు మరోసారి రికార్డు గరిష్ఠాలకు చేరాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో 7 శాతానికి పైగా పెరిగి కిలో రూ. 3.85 లక్షల జీవితకాల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఇదే సమయంలో అమెరికా కరెన్సీ డాలర్ పతనం కావడంతో బంగారం కూడా పది గ్రాములు రూ. 1.65 లక్షలతో చారిత్రాత్మక స్థాయిలకు దూసుకెళ్లింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ఏకంగా రూ. 5,130 పెరిగి రూ. 1,67,190కి చేరింది. ఆభరణాల తయారీ ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 4,700 పెరిగి రూ. 1,53,150కి చేరింది. వెండి సైతం ఒక్కరోజే రూ. 15,000కు పైగా పెరగడంతో కిలో రూ. 3.96 లక్షలకు అంటే దాదాపు రూ. 4 లక్షల మార్కుకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్స్ 5,251.1 డాలర్లకు చేరింది. డాలర్ పతనం, చైనాలోని పరిణామాల వల్ల వెండి ర్యాలీకి మరింత ఆజ్యం తోడైంది. ఫలితంగా ఔన్స్ వెండి రూ. 117.70 డాలర్లకు చేరుకుంది.
మరోవైపు, భారతీయ ఈక్విటీ మార్కెట్లు అధిక లాభాలను కొనసాగించాయి. ఇండియా-ఈయూ మధ్య కుదురిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ప్రధానంగా బుధవారం సెషన్ ర్యాలీకి దోహదపడ్డాయి. ఈ ఒప్పందం తర్వాత అంతర్జాతీయ సంకేతాలు మెరుగూపడటం, వాణిజ్య రంగంలో సెంటిమెంట్ బలపడటంతో భారత ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 487.20 పాయింట్లు పెరిగి 82,344 వద్ద, నిఫ్టీ 167.35 పాయింట్లు లాభపడి 25,342 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బీఈల్, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ట్రెంట్, ఎంఅండ్ఎం లాంటి షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఏషియన్ పెయింట్, మారుతీ సుజుకి, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్ స్టాక్స్ ఎక్కువ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 91.95 వద్ద ఉంది.






