Silver: కొత్త రికార్డు గరిష్ఠాలకు వెండి, బంగారం ధరలు

by S Gopi |   (  Updated:2026-01-14 15:13:13  IST  )

తాజా పెరుగుదలతో, వెండి గత నాలుగు సెషన్లలో కిలోకు 17.45 శాతం మేర పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20 శాతం పుంజుకుంది.

Silver: కొత్త రికార్డు గరిష్ఠాలకు వెండి, బంగారం ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. ఇందుకు ప్రధానంగా ప్రపంచ అనిశ్చితి వల్ల సురక్షిత స్వర్గధామంగా పసిడి, వెండికి డిమాండ్ పెరిగింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెట్టుబడిదారులను విలువైన లోహాల వైపు నెడుతున్నాయి. వీటికి తోడు బలహీన యూఎస్ డాలర్, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలతో ధరలు అమాంతం ఊపందుకున్నాయి. వెండి విషయంలోనూ పారిశ్రామిక డిమాండ్, సరఫరా కారణంగా ధరలు పెరిగాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్, ఈవీ వంటి రంగాలలో వెండి వినియోగం పెరిగింది. డిమాండ్-సరఫరా అసమతుల్యత బంగారంతో పాటు వెండి ధరల పెరుగుదలను ప్రభావితం చేశాయి.

ఈ నేపథ్యంలోనే బుధవారం దేశ రాజధానిలో వెండి ధరలు కిలోకు రూ. 2,86,000 వద్ద కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం కూడా పెరిగి 10 గ్రాములకు రూ. 1,44,100 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్‌లో వెండి ధరలు వరుసగా నాలుగో రోజు కూడా దూకుడుగా ర్యాలీ చేశాయి. రూ. 15,000 పెరగడంతో కిలోకు రూ. 2,90,000 (అన్ని పన్నులతో కలిపి)కి చేరుకున్నాయి. తాజా పెరుగుదలతో, వెండి గత నాలుగు సెషన్లలో కిలోకు 17.45 శాతం మేర పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 20 శాతం పుంజుకుంది. స్వచ్ఛమైన పసిడి పది గ్రాములు రూ. 1,470 పెరిగి రూ. 1,44,100 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,350 పెరిగి రూ. 1,32,000కి పెరిగింది. దీంతో బంగారం గత నాలుగు సెషన్లలో 4.3 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.4 శాతం పెరిగింది.

Read More : Today Gold, Silver Rates: సంక్రాంతి పండగ వేళ భారీ షాక్.. ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం, వెండి ధరలు

Next Story