Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |

కీలక ఆటో, మెటల్, ఐటీ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ కారణంగా సూచీలు కుదేలయ్యాయి

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, ఆసియా మార్కెట్లలోనూ నష్టాలు ఎదురవడంతో పాటు దేశీయంగా కీలక ఆటో, మెటల్, ఐటీ రంగాల షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ కారణంగా సూచీలు కుదేలయ్యాయి. ఇదే సమయంలో ఇన్ఫోసిస్, ఎల్అండ్‌టీ, ఐసీఐసీఅ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు మరింత ఒత్తిడిని పెంచాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) కూడా బుధవారం ట్రేడింగ్‌లో మన మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం, అంతర్జాతీయ పరిణామాల మధ్య ముడి చమురు ధరలు ఏకంగా 2 డాలర్లకు మించి పెరగడం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను బలహీనపర్చింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 69.88 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ అనిశ్చితి, ఎఫ్అండ్ఓ గడువు ముగియనుండటం వంటి కారణాలు కూడా మార్కెట్లు అస్థిరంగా ర్యాలీ చేశాయని విశ్లేషకులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 823.16 పాయింట్లు కుదేలై 81,691 వద్ద, నిఫ్టీ 253.20 పాయింట్లు క్షీణించి 24,888 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్, టెక్ మహీంద్రా స్టాక్స్ మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలిన అన్నీ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.54 వద్ద ఉంది.

Next Story