Stock Market: 1,400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

by S Gopi |

దేశీయంగా ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో కీలక షేర్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి.

Stock Market: 1,400 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ లాభాలు నమోదయ్యాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్ విడుదలైనప్పటికీ అంతర్జాతీయ పరిణామాల వల్ల సూచీలు వరుస నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతకుముందు సెషన్‌లో ఉత్తర అమెరికాలో జరుగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా మార్కెట్లు దెబ్బతిన్నాయి. తాజాగా మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో దేశాలపై విధించిన పన్ను అమలును వాయిదా వేయడంతో మార్కెట్లకు సానుకూల మద్దతు లభించింది. ఈ నిర్ణయం ఆసియా మార్కెట్లలోనూ ర్యాలీకి కారణమైంది.

మరోవైపు దేశీయంగా బుధవారం నుంచి జరగనున్న ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలతో కీలక బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్లు పుంజుకున్నాయి. ఈ ఏడాది జనవరి నెలకు సంబంధించి వాహన మార్కెట్లో అమ్మకాలు ఊపందుకోవడం, తాజా బడ్జెట్‌లో ప్రకటించిన వినియోగ సంబంధిత నిర్ణయాలతో వాహనాల అమ్మకాలు పెరగనున్నాయనే సంకేతాలు ర్యాలీకి మరింత దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు పుంజుకుంది. గత కొన్ని సెషన్లుగా బలహీనపడిన తర్వాత కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడం కూడా భారీ లాభాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,397.07 పాయింట్లు ఎగసి 78,583 వద్ద, నిఫ్టీ 378.20 పాయింట్లు లాభపడి 23,739 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు పెరిగాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎల్అండ్‌టీ, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్ వంటి షేర్లు అధిక లాభాలను చూశాయి. ఐటీసీ హోటల్స్, జొమాటో, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.10 వద్ద ఉంది.

Next Story