- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Stock Market: 2 శాతానికి పైగా పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో 2 శాతానికి పైగా పుంజుకున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాలను తాత్కాలికంగా వాయిదా వేయడంతో పాటు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను మినహాయించడం, ఆటోమొబైల్స్‌పై సుంకం సవరించడంతో మదుపర్ల సెంటిమెంట్ సానుకూలంగా మారింది. వీటి ప్రభావంతో ఆసియా మార్కెట్లతో పాటు యూరప్ మార్కెట్లలోనూ ర్యాలీ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలోనూ గణనీయమైన ర్యాలీ కనిపించింది. ఇక దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి మన మార్కెట్లలోకి నిధులు మళ్లించడం, అమెరికా కరెన్సీ డాలర్ బలహీనపడటంతో అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి మార్కెట్లకు కలిసొస్తుందనే నిపుణుల అంచనాలు మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ కారణంగానే ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లాంటి కీలక బ్యాంకుల షేర్లు 3 శాతం పుంజుకున్నాయి. ఇక, ట్రంప్ టారిఫ్ మినహాయింపుతో ఆటో రంగ షేర్లలోనూ ఉత్సాహం కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,577.33 పాయింట్లు ఎగసి 76,734 వద్ద, నిఫ్టీ 500 పాయింట్లు లాభపడి 23,328 వద్ద ముగిశాయి. ఈక్విటీ మార్కెట్ల అధిక లాభాల కారణంగా మదుపర్ల సంపద ఒక్కరోజే దాదాపు రూ. 9 లక్షల కోట్లు పెరిగింది. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 410 లక్షల కోట్లను అధిగమించింది. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 85.77 వద్ద ఉంది.