మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!

by Dishanational4 |
మళ్లీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతకుముందు వరుస ఏడు రోజుల పాటు నష్టాలను చూసిన తర్వాత గత వారాంతం అధిక లాభాలు నమోదు చేసిన సూచీలు మళ్లీ నీరసించాయి. తాజాగా, ముడి చమురు ధరలు కనిష్టాల నుంచి 4 శాతం పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల కారణంగా సోమవారం మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన సమయంలో తక్కువ నష్టాల్లో ట్రేడింగ్ జరిగినప్పటికీ, మిడ్-సెషన్ నుంచి ఆశించిన స్థాయిలో ఇన్వెస్టర్లు సానుకూల అంశాలేవీ లేకపోవడంతో భారీ నష్టాలకు దారితీశాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 638.11 పాయింట్లు పతనమై 56,788 వద్ద, నిఫ్టీ 207 పాయింట్లు క్షీణించి 16,887 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫార్మా రంగం మాత్రమే పుంజుకోగా, మెటల్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు అత్యధికంగా 2 శాతం కంటే ఎక్కువ నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో డా రెడ్డీ, భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, విప్రో కంపెనీల షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని షేర్లు కుదేలయ్యాయి.

ముఖ్యంగా మారుతీ సుజుకి, హిందూస్తాన్ యూనిలీవర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, కొటక్ బ్యాంక్ స్టాక్ 2-4 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 50 పైసలకు పైగా బలహీనపడి రూ. 81.80 వద్ద ఉంది. డాలర్ ఇండెక్స్ భారీ పెరుగదలతో గ్లోబల్ ఇన్వెస్టర్లు డాలర్ ఆధారిత సెక్యూరిటీలను కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండటంతో రూపాయి బలహీనపడుతోందని విశ్లేషకులు వెల్లడించారు.


Next Story

Most Viewed