Stock Market: 81 వేల దిగువకు సెన్సెక్స్

by S Gopi |

గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు తోడు కీలక ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒత్తిడి కనిపించింది.

Stock Market: 81 వేల దిగువకు సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతకుముందు సెషన్‌లో స్వల్ప నష్టాలను చూసిన సూచీలు, మంగళవారం ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం కొంతసేపు నిలదొక్కుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, మిడ్-సెషన్‌కు ముందు నుంచి క్రమంగా దిగజారాయి. అయితే, గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు తోడు కీలక ఐటీ రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒత్తిడి కనిపించింది. దీనికి తోడు గత కొన్ని రోజులుగా మన మార్కెట్లలో నిధులు పెడుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) మళ్లీ అమ్మకాలకు దిగడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, ఈ వారాంతంలో ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం జరగనుండటం వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 636.24 పాయింట్లు పతనమై 80,737 వద్ద, నిఫ్టీ 174.10 పాయింట్లు క్షీణించి 24,542 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం స్టాక్ మాత్రమే లాభపడింది. అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్, ఎటర్నల్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.68 వద్ద ఉంది.

కొత్త గరిష్ఠాలకు బ్యాంక్‌ నిఫ్టీ

గత కొంతకాలంగా బ్యాంకింగ్ రంగం షేర్లలో మెరుగైన ర్యాలీ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కీలక ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి షేర్లు ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ తొలిసారి 56,000 సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకాయి. మంగళవారం మార్కెట్లు ప్రారంభమైన కొద్దిసేపటికే 56,161.40కు చేరిన అనంతరం లాభాల స్వీకరణ వల్ల కొంత నెమ్మదించినప్పటికీ ఆల్‌టైమ్ హై స్థాయిలో నిఫ్టీ బ్యాంక్ ఉంది. 2025లో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఇతర సూచీల కంటే అత్యధిక ర్యాలీని చూసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 10 శాతం మేర లాభపడింది. 52 వారాల కనిష్ట స్థాయి నుంచి 15 శాతం పుంజుకుంది. గత 12 నెలల్లో నిఫ్టీ బ్యాంక్ మదుపర్లకు 9.7 శాతం రాబడిని అందించింది.

Next Story