Stock Market: స్టాక్ మార్కెట్లలో రికవరీ

by S Gopi |

ట్రంప్ టారిఫ్ అంశానికి తోడు ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే సంకేతాలు సెంటిమెంట్‌ను పెంచింది

Stock Market: స్టాక్ మార్కెట్లలో రికవరీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: రికార్డు పతనం తర్వాత భారతీయ ఈక్విటీ మార్కెట్లు తిరిగి రికవరీ సాధించాయి. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనతో చరిత్రలోనే అత్యంత చెత్త సెషన్‌ను చూసిన సూచీలు మంగళవారం ట్రేడింగ్‌లో పుంజుకున్నాయి. టారిఫ్ విషయంలో అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ప్రపంచ దేశాలతో చర్చలు సిద్ధమని సంకేతాలివ్వడంతో గ్లోబల్ మార్కెట్లు రాణించాయి. ఈ ప్రభావంతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్లలోనూ ర్యాలీ కనిపించింది. ట్రంప్ టారిఫ్ అంశానికి తోడు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఎంపీసీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచింది. ఈ పరిణామాల మధ్య ఓ దశలో సెన్సెక్స్ ఇండెక్స్ 1500 పాయింట్ల కంటే ఎక్కువ పెరిగాయి. ఆఖర్లో అమ్మకాల వల్ల లాభాలు తగ్గాయి. ప్రధానంగా టారిఫ్‌పై అమెరికా సందేహంలో పడటం, ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌పై తక్కువ పన్నుల వల్ల మనకు నష్టం తక్కువనే అంచనాలు, గ్లోబల్ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్లు పుంజుకునేందుకు దోహదపడ్డాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,089.18 పాయింట్లు లాభపడి 74,227 వద్ద, నిఫ్టీ 374.25 పాయింట్లు పెరిగి 22,535 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, రియల్టీ, ఫైనాన్స్, బ్యాంకింగ్, కన్స్యూమర్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభాలౌ నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.19 వద్ద ఉంది. మన మార్కెట్లతో పాటు అంతకుముందు సెషన్‌లో కుప్పకూలిన ఇతర దేశాల ఈక్విటీ ఇండెక్స్‌లు మంగళవారం రికవరీ సాధించాయి. జపాన్ నిక్కీ అత్యధికంగా 6 శాతం, హాంగ్‌కాంగ్, చైనా మార్కెట్లు కూడా 1.50 శాతానికి పైగా లాభపడ్డాయి.

Next Story