బ్లాక్ ఫ్రైడే : భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం

by Ajay Maddhiboyina |

కెనడా, మెక్సికో నుంచి దిగుమతయ్యే వస్తువలపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుందనే భయంతో ఈ క్షీణత మరింత ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

బ్లాక్ ఫ్రైడే : భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం
X

- 1400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్

- 22,150 కంటే దిగువకు నిఫ్టీ

- రూ.9 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ హాంఫట్

దిశ, నేషనల్ బ్యూరో: దలాల్ స్ట్రీట్‌లో రక్తపాతం కొనసాగింది. భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు దాదాపు 2 శాతం మేర పడిపోవడంతో మదుపర్లకు బ్లాక్ ఫ్రైడేగా మిగిలింది. ప్రపంచ వాణిజ్య యుద్దం, విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాల భయాలు, ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడి కారణంగానే మార్కెట్లు పతనమయ్యాయి. సెన్సెక్స్ 1414 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 22,250 దిగువకు పడిపోయింది. మార్కెట్ల భారీ పతనం కారణంగా దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆవిరైపోయాయి. కేవలం భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా ఆసియాలోని సియోల్, టోక్యో, షాంగై, హాంకాంగ్ మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,414 పాయింట్లు (1.9 శాతం) పడిపోయి 73,198 వద్ద, నిఫ్టీ 420 పాయింట్లు (1.86 శాతం) పడిపోయి 22,124 వద్ద ముగిసింది. నిఫ్టీ వరుసగా ఐదవ నెలవారీ నష్టాలను నమోదు చేసింది. 29 ఏళ్లలో ఇలా వరుసగా అత్యంత పొడవైన నెలవారీ నష్టాలను నమోదు చేయడం గమనార్హం.

శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. అమెరికాలో ఎన్‌వీడియా స్టాక్స్ రాత్రి పూట పడిపోయిన తర్వాత.. నిఫ్టీ 6.5 శాతం కుప్పకూలింది. టెక్ మహీంద్ర, విప్రో, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీలు అత్యధికంగా నష్టపోయాయి. ఆటో స్టాక్స్ కూడా నష్టాలను చవిచూశాయి. నిఫ్టో ఆటో ఇండెక్స్ దాదాపు 4 శాతం మేర పడిపోయింది. ఇక బ్యాంకింగ్, మెటల్, మీడియా, ఎఫ్ఎం‌సీజీ, ఫార్మా, ఆయిల్, గ్యాస్ వంటి ఇతర రంగాలు 0.7 శాతం నుంచి3.5 శాతం మధ్య పతనమయ్యాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందడంతో బేరిష్ మార్కెట్ సెంటిమెంట్ మధ్య దేశీయ మార్కెట్లు తీవ్ర క్షీణతను చవి చూసినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనాధిపతి వినోద్ నాయర్ చెప్పారు.

కెనడా, మెక్సికో నుంచి దిగుమతయ్యే వస్తువలపై అమెరికా 25 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుందనే భయంతో ఈ క్షీణత మరింత ఎక్కువగా ఉన్నట్లు ఆయన చెప్పారు. చైనా వస్తువుల మీద కూడా అదనంగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తుండటం మార్కెట్ సూచీల పతనానికి ప్రధాన కారణంగా చెప్పారు.

Next Story