SEBI: ఐపీఓ లిస్టింగ్‌లో భారీ మార్పులకు సెబీ సిద్ధం

by S Gopi |

ప్రస్తుతం కొన్ని ఐపీఓలు, రీలిస్టెడ్ షేర్లలో మొదటి రోజు ట్రేడింగ్ సమయంలో షేర్ ధరలు అసాధారణంగా మారుతున్నాయని, దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని సెబీ గుర్తించింది.

SEBI: ఐపీఓ లిస్టింగ్‌లో భారీ మార్పులకు సెబీ సిద్ధం
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఐపీఓల్లో భారీ మార్పులకు సిద్ధమవుతోంది. ఐపీఓలు, స్టాక్ మార్కెట్‌లో రీలిస్ట్ అయ్యే కంపెనీల షేర్ల ధరల విధానంలో కీలక మార్పులను ప్రతిపాదించింది. ప్రస్తుతం కొన్ని ఐపీఓలు, రీలిస్టెడ్ షేర్లలో మొదటి రోజు ట్రేడింగ్ సమయంలో షేర్ ధరలు అసాధారణంగా మారుతున్నాయని, దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉందని సెబీ గుర్తించింది. అందుకే షేర్ ప్రారంభ ధరను మరింత పారదర్శకంగా, న్యాయంగా నిర్ణయించే కొత్త వ్యవస్థను తీసుకురావాలని యోచిస్తోంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం, రీలిస్ట్ అయ్యే కంపెనీల షేర్లకు గడిచిన ఆరు నెలల్లో ట్రేడింగ్ జరిగిన ధరను బేస్ ప్రైస్‌గా తీసుకుంటారు. అటువంటి ధర అందుబాటులో లేకపోతే, ఇండిపెండెంట్ వాల్యూయేషన్ ఏజెన్సీలు అంచనా వేసిన విలువ ఆధారంగా ధర నిర్ణయించనున్నారు.

ఐపీఓల విషయంలో కూడా ప్రీ-ఓపెన్ సెషన్స్‌లో ఉపయోగించే 'డమ్మీ ప్రైస్ బాండ్' విధానాన్ని మార్చాలని సెబీ భావిస్తోంది. ఒక కొత్త కంపెనీ షేర్లు మార్కెట్లోకి వచ్చిన లిస్టింగ్ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య 'ప్రీ-ఓపెన్ సెషన్' జరుగుతుంది. ఆ సమయంలో కొనుగోలుదారులు తమకు నచ్చిన ధరలకు ఆర్డర్లు పెడతారు. కానీ ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం, సెబీ నిర్ణయించిన ఒక చిన్న 'ప్రైస్ బ్యాండ్' దాటి షేర్లు ఉండకూడదు. దీన్ని సరిచేయడానికి సెబీ ఒక కొత్త ప్రతిపాదన తెచ్చింది. మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, 10 శాతం పరిమితిని స్టాక్ ఎక్స్ఛేంజీలే ఆటోమేటిక్‌గా పెంచుతాయి. అంటే ప్రైస్ బ్యాండ్‌ని ఇంకాస్త పెంచడం వల్ల అందరి ఆర్డర్లు యాక్సెప్ట్ అవుతాయి. కనీసం ఐదుగురు వేర్వేరు ఇన్వెస్టర్లు ఎక్కువ ధర కోసం ఆర్డర్ ఇస్తేనే, ఈ 'ప్రైస్ బ్యాండ్' పెరుగుతుంది. దీనివల్ల ఒకరి వల్ల మార్కెట్ కృత్రిమంగా పెరగకుండా ఉంటుంది. ఈ ప్రతిపాదనలపై సెబీ జూన్ 11 వరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించనుంది.

Next Story