Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్

by S Gopi |   (  Updated:2025-09-18 15:43:30  IST  )

కంపెనీలలోకి నిధులను మళ్లించినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది.

Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన స్టాక్ మానిప్యులేషన్ ఆరోపణలపై బిలియనీర్ గౌతమ్ అదానీ, ఆయన గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గురువారం క్లీన్‌చిట్ ఇచ్చింది. అదానీ గ్రూప్ దాని లిస్టెడ్ కంపెనీలలోకి నిధులను మళ్లించినట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొంది. చేసిన ఆరోపణలను హిండెన్‌బర్గ్ రుజువు చేయలేకపోయిందని స్పష్టం చేసింది. రెండు వేర్వేరు ఆర్డర్లలో.. ఇన్‌సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిగిందని, అవన్నీ నిరాధారమైనవని తేలాయని సెబీ వెల్లడించింది. 2023, జనవరిలో అదానీ గ్రూప్ షేర్ల ధరలను మేనిప్యూలేట్ చేస్తొందని, అకౌంటింగ్ మోసాలకు పాల్పడుతోందని హిండెన్​బర్గ్​ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌లోని వివిధ కంపెనీల నుంచి నిధులను స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ చేసిన అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు నిధులు సమకూర్చడానికి అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్‌స్టోన్ ట్రేడ్‌లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌లను ఒక మార్గంగా ఉపయోగించారని ఆరోపించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలతో జరిగిన లావాదేవీలలో ఎటువంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని సెబీ బోర్డు సభ్యుడు కమలేష్‌ సి వర్ష్నీ అన్నారు.

పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించే సెక్యూరిటీలు లేదా నియంత్రణను స్వాధీనం చేసుకోవడంలో ఎటువంటి ఉల్లంఘనలు లేవని కూడా సెబీ గుర్తించింది. కాబట్టి అదానీ సంస్థలు లేదా నిర్వాహకులపై బాధ్యులను చేయడానికి లేదా జరిమానాలు విధించడానికి ఎటువంటి ఆధారాలు లేవని సెబీ నిర్ధారించింది. అదానీ గ్రూప్ రుణాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించిందని, ఎక్కడా కూడా నిధులను పక్కదారి పట్టించిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

దెబ్బతిన్న అదానీ గ్రూప్..

అప్పట్లో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్ భారీగా సంపదను కోల్పోయింది. ఆ సమయానికి ప్రపంచంలోనే మూడో అత్యంత సంపన్న వ్యక్తిగానూ ఎదుగుతున్న గౌతమ్ అదానీ ఒక్కసారిగా టాప్-10 దిగువకు పడిపోయారు. అదానీ గ్రూప్ సంపద 150 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే క్షీణించింది. ఆ తర్వాత అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్టు ఆధారాలు లభించలేదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా నివేదికను ఇచ్చింది. ఆ తర్వాత నుంచే కుప్పకూలిన అదానీ గ్రూప్ షేర్లు క్రమంగా నిలదొక్కుకున్నాయి. ఇప్పుడు సెబీ ఇచ్చిన క్లీన్ చిట్‌తో కంపెనీ షేర్లు మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.

స్పందించిన గౌతమ్ అదానీ..

సెబీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై గౌతమ్ అదానీ స్పందించారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలలో అవాస్తవమని మళ్లీ రుజువైంది. ఈ విషయాన్ని మొదటినుంచి చెబుతున్నాం. కుట్రపూరితంగా తమపై చేసిన ఆరోపణల కారణంగా పెట్టుబడిదారులు నష్టపోవడం బాధిస్తోంది. తప్పుడు ఆరోపణలు చేసినవారు క్షమాపణలు చెప్పాలని గౌతమ్ అదానీ డిమాండ్ చేశారు.

Next Story