SEBI: టీ+0 సెటిల్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ అమలు గడువును పొడిగించిన సెబీ

by S Gopi |

క్యూఎస్‌బీలు నిర్వహణ, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

SEBI: టీ+0 సెటిల్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌ అమలు గడువును పొడిగించిన సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈక్విటీ నగదు మార్కెట్లో లావాదేవీల సెటిల్‌మెంట్‌ను అదే రోజు పూర్తిచేసేందుకు టీ+0 సెటిల్‌మెంట్ ప్రక్రియ అమలు గడువును స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరోసారి పొడిగించింది. అందుకు అవసరమైన వ్యవస్థలు, ప్రక్రియలను అమలు చేయడానికి క్వాలిఫైడ్ స్టాక్ బ్రోకర్లు (క్యూఎస్‌బీలు)కు మరికొంత సమయం ఇచ్చింది. గతంలో ఇచ్చిన నవంబర్ 1 గడువు ముగుస్తున్న నేపథ్యంలో క్యూఎస్‌బీలు నిర్వహణ, సాంకేతిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని గడువు పొడిగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు గురువారం సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొంది. క్యూఎస్‌బీలు ప్రస్తావించిన సవాళ్లను, టీ+0 సెటిల్‌మెంట్ ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చింది. అయితే, గడువును పొడిగిస్తున్నట్టు స్పష్టత ఇచ్చిన సెబీ, ఎప్పటివరకు అనే విషయాన్ని పేర్కొనలేదు. కొత్త తేదీని తర్వాత తెలియజేస్తామని వెల్లడించింది. బ్రోకర్లు లావాదేవీలు జరిగిన అదే రోజు సెటిల్‌మెంట్‌కు అవసరమైన సాంకేతిక మౌలిక సదుపాయాలను పరీక్షించేందుకు, సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఇస్తాం. పెట్టుబడిదారులకు సజావుగా టీ+0 సెటిల్‌మెంట్ ప్రక్రియ జరిగేలా చూడటమే ఈ పొడిగింపు లక్ష్యమని సెబీ పేర్కొంది.

టీ+0 సెటిల్‌మెంట్ అంటే?

ప్రస్తుతం మనం స్టాక్‌ మార్కెట్లలో షేర్లు కొనుగోలు చేస్తే టీ+1 రోజున అంటే ట్రేడింగ్ జరిగిన మరుసటి రోజు సెటిల్‌మెంట్‌ జరుగుతోంది. అయితే టీ+0 ద్వారా ట్రేడింగ్ జరిగిన అదే రోజు సెటిల్‌మెంట్‌ పూర్తవుతుంది. ప్రస్తుతానికి దీన్ని బీటా వర్షన్‌గా అమలు చేయాలని సెబీ భావిస్తోంది. మూడు, ఆరు నెలల తర్వాత సమీక్ష జరుపుతుంది. అన్ని సజావుగా జరిగితే పూర్తిస్థాయిలో టీ+0 అమల్లోకి తీసుకురానుంది.

Next Story