- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mehul Choksi: మెహుల్ చోక్సీ బ్యాంక్, డీమ్యాట్, ఎంఎఫ్ ఖాతాలను అటాచ్ చేయాలని సెబీ ఆదేశాలు
పెండింగ్‌లో ఉన్న రూ. 2.1 కోట్ల బకాయిలలో రూ. 1.5 కోట్లు జరిమానా, రూ. 60 లక్షలు వడ్డీ అని సెబీ తెలిపింది.

దిశ, బిజినెస్ బ్యూరో: గీతాంజలి జెమ్స్ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో మొత్తం రూ.2.1 కోట్ల బకాయిలను తిరిగి పొందడానికి సెబీ కీలక చర్యలు తీసుకుంది. ఆర్థిక నేరగాడు, పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌లను అటాచ్ చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. గత నెలలో 15 రోజుల్లోపు చెల్లింపు చేయకపోతే ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్ చేస్తామని చోక్సీకి జారీ చేసిన డిమాండ్ నోటీసుల ఆధారంగా సెబీ తాజా చర్యలు తీసుకుంది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో 2022, జనవరిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) విధించిన జరిమానాను చోక్సీ చెల్లించకపోవడంతో డిమాండ్ నోటీసులు పంపింది. తాజా నోటీసుల్లో పెండింగ్‌లో ఉన్న రూ. 2.1 కోట్ల బకాయిలలో రూ. 1.5 కోట్లు జరిమానా, రూ. 60 లక్షలు వడ్డీ అని సెబీ తెలిపింది. కాగా, గీతాంజలి జెమ్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ గ్రూప్‌లో భాగమైన మేహుల్ చోక్సీ నీరవ్ మోడీకి మామ. ఇద్దరూ ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను రూ.14,000 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018 ప్రారంభంలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత చోక్సీ, మోడీ ఇద్దరూ భారత్ నుంచి పారిపోయారు. మెహుల్ చోక్సీ నుంచి బకాయిలను తిరిగి పొందడానికి, సెబీ అన్ని బ్యాంకులు, డిపాజిటరీలు(సీడీఎస్ఎల్, ఎన్ఎస్‌డీఎల్ సహా), మ్యూచువల్ ఫండ్‌లను చోక్సీ ఖాతాల నుంచి ఎటువంటి డెబిట్‌ను అనుమతించవద్దని కోరింది. అయితే, క్రెడిట్‌లకు అనుమతిచ్చింది. ఇంకా, డిఫాల్టర్ వద్ద ఉన్న అన్ని ఖాతాలను, లాకర్లను అటాచ్ చేయాలని సెబీ బ్యాంకులను స్పష్టం చేసింది.






