SBI: 2025 ఏడాదికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఎస్‌బీఐ

by S Gopi |

ప్రపంచ బ్యాంకింగ్ లీడర్‌గా ఎస్‌బీఐ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది.

SBI: 2025 ఏడాదికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఎస్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అరుదైన గౌరవం దక్కించుకుంది. 2025 ఏడాదికి సంబంధించి ఎస్‌బీఐ ప్రపంచంలోనే ఉత్తమ కన్స్యూమర్ బ్యాంక్, భారత ఉత్తమ బ్యాంకు అవార్డులను సొంతం చేసుకుంది. గురువారం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ అవార్డు ప్రధానోత్సవంలో న్యూయార్క్‌లోని గ్లోబల్ ఫైనాన్స్ నుంచి ఈ ప్రశంసలను అందుకుంది. ఈ రెండు ప్రతిష్టాత్మక గుర్తింపు ద్వారా ఆవిష్కరణ, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, కస్టమర్ సేవలకు కట్టుబడి ఉన్న ప్రపంచ బ్యాంకింగ్ లీడర్‌గా ఎస్‌బీఐ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని బ్యాంకు అధికారిక ప్రకటనలో తెలిపింది. భారత్ లాంటి విభిన్నమైన భౌగోళిక ప్రాంతంలో టెక్నాలజీ లీడర్‌సిప్‌ని కొనసాగిస్తూ, సేవలను విస్తరించే సమయంలో కస్టమర్లకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడంలో ఎస్‌బీఐ సాధించిన విజయానికి ఈ అవార్డులు ప్రతిబింబిస్తాయని బ్యాంకు అభిప్రాయపడింది. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి.. ఎస్‌బీఐ రోజువారీ నాణ్యమైన సేవలను, నిబద్ధతను గ్లోబల్ ఫైనాన్స్ గుర్తించడం ఎంతో గౌరవంగా ఉంది. 52 కోట్ల మంది కస్టమర్లకు సేవలందించడానికి, రోజూ 65 వేల మంద్ కొత్త కస్టమర్లను సంపాదించడానికి సాంకేతికత, డిజిటలైజేషన్‌లో భారీ పెట్టుబడులు అవసరం. 'డిజిటల్ ఫస్ట్, కన్స్యూమర్ ఫస్ట్' బ్యాంకుగా, మా ఫ్లాగ్‌షిప్ మొబైల్ అప్లికేషన్ కోటి మంది రోజువారీ యాక్టివ్ యూజర్లతో 10 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Next Story