- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SBI: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్
ప్రధానంగా రివార్డ్ పాయింట్లు సంపాదించే విధానంలో మార్పులు చేస్తూ, కొన్ని ఖర్చులపై పరిమితులు విధించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎస్‌బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఫోన్‌పేతో కలిసి తెచ్చిన కో బ్రాండెడ్ పర్పుల్, సెలెక్ట్ బ్లాక్ క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న వినియోగదారులకు ఎస్‌బీఐ కార్డ్ కీలక మార్పులు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా రివార్డ్ పాయింట్లు సంపాదించే విధానంలో మార్పులు చేస్తూ, కొన్ని ఖర్చులపై పరిమితులు విధించింది. అలాగే కొన్ని కేటగిరీల లావాదేవీలకు ఇకపై రివార్డ్ పాయింట్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ పర్పుల్ వినియోగదారులకు ఇప్పటివరకు ఫోన్‌పే ద్వారా చేసిన ఖర్చులపై నెలకు గరిష్టంగా 1,000 రివార్డ్ పాయింట్లు, ఆన్‌లైన్ ఖర్చులపై మరో 1,000 పాయింట్లు లభించేవి. జూలై నుంచి ఈ విధానంలో మార్పు ఉంటుంది. ఫోన్‌పే ద్వారా చేసే ఇన్సూరెన్స్ చెల్లింపులపై నెలకు గరిష్టంగా 250 పాయింట్లు, ఇతర అర్హత కలిగిన ఫోన్‌పే లావాదేవీలపై 750 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. అలాగే ఆన్‌లైన్ ఖర్చులపై గరిష్ట పరిమితిని 1,000 నుంచి 750 పాయింట్లకు తగ్గించారు.
సెలెక్ట్ బ్లాక్ కార్డ్ హోల్డర్లకు కూడా ఇదే తరహా మార్పులు వర్తిస్తాయి. ఇప్పటివరకు ఫోనే ఖర్చులపై నెలకు 2,000 పాయింట్లు, ఆన్‌లైన్ ఖర్చులపై మరో 2,000 పాయింట్లు సంపాదించే అవకాశం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం ఇన్సూరెన్స్ చెల్లింపులపై గరిష్టంగా 500 పాయింట్లు, ఇతర లావాదేవీలపై 1,500 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. ఆన్‌లైన్ ఖర్చులపై పరిమితిని 2,000 నుంచి 1,000 పాయింట్లకు తగ్గించారు. అంటే ఖర్చు పెరిగినా, ఈ పరిమితిని మించిన పాయింట్లు ఖాతాలో జమ కావు. అంతేకాకుండా, సెలెక్ట్ బ్లాక్ కార్డుతో పాటు ఈ మార్పులు వర్తించే ఇతర అర్హత కలిగిన కార్డుల విషయంలో కొన్ని లావాదేవీలను పూర్తిగా రివార్డ్ పాయింట్ల పరిధి నుంచి తొలగించారు. టోల్, బ్రిడ్జ్ ఫీజులు, జ్యువెలరీ కొనుగోళ్లు, విద్యా సంస్థలకు చెల్లింపులు, ఫోన్‌పే యాప్ వెలుపల చేసిన యుటిలిటీ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, యూపీఐ లావాదేవీలపై ఇక రివార్డ్ పాయింట్లు లభించవు. అయితే ఈ మార్పులు తప్ప మిగతా కార్డ్ ఫీచర్లు, ఇతర ప్రయోజనాల్లో ఎలాంటి మార్పు లేదని ఎస్‌బీఐ కార్డ్ వెల్లడించింది.






