SBI: దేశ జీడీపీ వృద్ధిలో మరింత కీలకంగా మారేందుకు ఎస్‌బీఐ కృషి

by S Gopi |

దేశ జీడీపీలో 2047 నాటికి 25 శాతానికి విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు.

SBI: దేశ జీడీపీ వృద్ధిలో మరింత కీలకంగా మారేందుకు ఎస్‌బీఐ కృషి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశ వృద్ధిలో మరింత కీలకంగా మారేందుకు కృషి చేస్తోందని బ్యాంకు ఛైర్మన్ సీ ఎస్ శెట్టి చెప్పారు. దేశ స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో ప్రస్తుతం 20 శాతంగా ఉన్న ఎస్‌బీఐ ఆస్తుల పరిమాణాన్ని 2047 నాటికి 25 శాతానికి విస్తరించే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. తాజాగా ఎన్‌పీసీఐ ఎండీ, సీఈఓ దిలీప్ అస్బెతో జరిగిన ఓ చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌బీఐ తరచుగా భారత ఆర్థికవ్యవస్థకు గణనీయమైన సహకారాన్ని అందిస్తోంది. ఎందుకంటే బ్యాంకు డిపాజిట్లలో 33 శాతం, రుణాలలో 20 శాతం వాటా కలిగి ఉంది. గత రెండు దశాబ్దాలుగా ఎస్‌బీఐ ఆస్తుల పరిమాణం స్థిరంగా దేశ జీడీపీలో 20 శాతం ఉంది. ప్రభుత్వ వికసిత్ భారత్ లక్ష్యం సాధించే క్రమంలో దేశ వృద్ధికి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆస్తుల పరంగా భారత ఆర్థికవ్యవస్థలో నాలుగో వంతు వాటా ఉండే దిశగా పనిచేస్తున్నాం. అంతేకాకుండా ఆస్తుల పరిమాణంలో ప్రపంచంలో టాప్-10 బ్యాంకులలో ఒకటిగా ఎదగాలని భావిస్తున్నాం. ప్రస్తుతం టాప్-50లో ఉన్న ఏకైక భారతీయ బ్యాంకు ఎస్‌బీఐ అని సీ ఎస్ శెట్టి అన్నారు. 2024-25 నాటికి ఎస్‌బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం రూ. 66 లక్షల కోట్లకు పైనే ఉందని ఆయన పేర్కొన్నారు.

భారత్ సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ లాంటి అభివృద్ధి చెందుతున్న రంగాలపై దృష్టి పెట్టాలని సీ ఎస్ శెట్టి ప్రస్తావించారు. అనేక సంవత్సరాలుగా ఎస్‌బీఐ వివిధ పరిశ్రమలకు ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా, వాటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఎస్‌బీఐ మద్దతిస్తోంది. ఎస్‌బీఐలో అభివృద్ధి చెందుతున్న రంగాల ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కోసం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' అనే పరిశ్రమ సహకార లేదా సమన్వయ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ఇటువంటి అనేక కొత్త రంగాలు భారత ఆర్థిక వ్యవస్థకు దోహదపడతాయి. ఈ రంగాలకు ఆర్థిక సహాయం చేయడానికి ఎస్‌బీఐ సిద్ధంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

Next Story