Sanchar Saathi: 'సంచార్ సాథీ ఆప్షనల్ మాత్రమే, డిలీట్ చేసుకోవచ్చు': ప్రభుత్వం స్పష్టత

by S Gopi |   (  Updated:2025-12-02 11:25:50  IST  )

వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని వారి డివైజ్/మొబైల్స్ నుంచి తీసేయడానికి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు.

Sanchar Saathi: సంచార్ సాథీ ఆప్షనల్ మాత్రమే, డిలీట్ చేసుకోవచ్చు: ప్రభుత్వం స్పష్టత
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అమ్మే అన్ని మొబైల్‌ఫోన్‌లలో డీఫాల్ట్‌గా సంచార్ సాథీ యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన ఒకరోజు వ్యవధిలోనే నిర్ణయం మార్చుకుంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు దీన్నొక నియంతృత్వ ధోరణిగా విమర్శలు చేయడంతో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం మరో ప్రకటన ఇచ్చారు. ప్రభుత్వ 'సంచార్ సాథి' యాప్ వినియోగదారులకు తప్పనిసరి కాదని స్పష్టం చేశారు. వినియోగదారులు కావాలనుకుంటే దాన్ని వారి డివైజ్/మొబైల్స్ నుంచి తీసేయడానికి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నారు. ఈ యాప్, దాని లక్ష్యం అందరికీ చేరాలనేదే ప్రభుత్వం ఉద్దేశమని, దాన్ని మొబైల్స్‌లో ఉంచుకోవాలా లేదా అనేది కస్టమర్ల ఇష్టమని పార్లమెంటు వెలుపల సింధియా మీడియాతో చెప్పారు. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు యాప్‌ను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం విమర్శించిన తర్వాత మంత్రి ఈ వివరణ ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ప్రజల గోప్యతను ఉల్లంఘిస్తుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

సోమవారం దేశంలో విక్రయించే, తయారు చేసే లేదా దిగుమతి చేసుకున్న ప్రతి మొబైల్‌లోనూ సంచార్ సాథి యాప్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయాలని అన్ని మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నకిలీ మొబైల్ ఫోన్‌ల అమ్మకాలను ఆపడానికి, టెలికాం సేవల దుర్వినియోగాన్ని కనుగొనే ప్రయత్నాల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొంది.

Next Story