Salary Hike: 2026లో జీతాలు సగటున 9 శాతం పెరగొచ్చు: అయాన్

by S Gopi |

అనేక కంపెనీలు అవకాశాలను ఉపయోగించుకునే క్రమంలో ఉద్యోగులకు మెరుగైన జీతాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని రూపాంక్ చౌదరీ అన్నారు

Salary Hike: 2026లో జీతాలు సగటున 9 శాతం పెరగొచ్చు: అయాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వ‌చ్చే ఏడాది దేశంలో వివిధ రంగాల్లోని ఉద్యోగుల జీతాలు స‌గ‌టున 9 శాతం పెర‌గ‌వ‌చ్చ‌ని కన్సల్టింగ్ సంస్థ అయాన్ స‌ర్వే తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించినప్పటికీ, 2025లో వాస్తవంగా పెంచిన 8.9 శాతం కంటే 2026లో స్వల్పంగా వేతనాలు పెరుగుతాయి. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా అన్ని రంగాలపై సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ స్థిరమైన ఆర్థిక వృద్ధిని, ద్రవ్యోల్బణ నియంత్రణను కలిగి ఉంది. దీంతో అనేక కంపెనీలు అవకాశాలను ఉపయోగించుకునే క్రమంలో ఉద్యోగులకు మెరుగైన జీతాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ట్యాలెంట్ సొల్యూషన్స్ పార్ట్‌నర్ రూపాంక్ చౌదరీ అన్నారు.

అయితే, కోవిడ్ మహమ్మారి వచ్చిన 2020ని మినహాయించి, భారత్‌లో సగటు జీతం పెరుగుదల 9 శాతం నమోదవడం గత 15 ఏళ్లలోనే అత్యల్పమని అయాన్ అభిప్రాయపడింది. పెరుగుతున్న ఖర్చులు, నిర్వహణ ఒత్తిళ్లు, ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ప్రపంచ అనిశ్చితి కారణంగా జీతాల పెరుగుదల కొంత తగ్గిందని నివేదిక అభిప్రాయపడింది. ఓవైపు వేతన పెరుగుదల తగ్గుతుంటే, కంపెనీలు మెరుగైన పనితీరు ఉన్న, ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు ఎక్కువ బడ్జెట్ కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ముఖ్యమైన స్కిల్స్ ఉన్నవారిని కాపాడుకోవడానికి కంపెనీ ప్రయత్నానికి సంకేతమని ట్యాలెంట్ సొల్యూషన్స్ అసోసియేట్ పార్ట్‌నర్ అమిత్ ఓట్వానీ పేర్కొన్నారు.

రంగాల వారీగా చూస్తే, రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రా, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల్లో అత్యధికంగా 10.9 శాతం మేర జీతాలు పెరగనున్నాయి. అత్యధికంగా సీనియర్, మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు 8.5-8.9 శాతం మేర జీతాలు పెరగనున్నాయని నివేదిక వెల్లడించింది.

Next Story