తిరిగి పుంజుకుంటున్న రూపాయి.. ఒక్క రోజే 97 పైసలు జంప్

by Malleboina Mahesh |

గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒత్తిడిని ఎదుర్కొన్న భారత రూపాయి, ఎట్టకేలకు తిరిగి పుంజుకుంది.

తిరిగి పుంజుకుంటున్న రూపాయి.. ఒక్క రోజే 97 పైసలు జంప్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఒత్తిడిని ఎదుర్కొన్న భారత రూపాయి, ఎట్టకేలకు తిరిగి పుంజుకుంది. అమెరికన్ డాలర్ విలువ స్వల్పంగా బలహీనపడటం, దేశీయ మార్కెట్లలోకి పెట్టుబడులు తిరిగి రావడంతో రూపాయి మారకం విలువ ఒక్క రోజే 97 పైసలు బలపడింది. దీనితో ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.27 వద్ద కొనసాగుతోంది. ఈ రికవరీ ఎగుమతిదారులు, దిగుమతి దారులకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. అమెరికా ఆర్థిక విధానాల్లో మార్పులు. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా మారడమే రూపాయి బలోపేతానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గత కొద్ది నెలలుగా రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోయి ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలోనే రూపాయి విలువ తొలిసారిగా రూ. 91 మార్కును దాటి 91.14 వద్ద ఆల్‌టైమ్ లో (All-time low) రికార్డును తాకింది. అమెరికా విధించిన 50 శాతం దిగుమతి సుంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడిదారుల ఉపసంహరణ రూపాయిని పాతాళానికి నెట్టాయి. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమయానుకూలంగా జోక్యం చేసుకుని డాలర్లను విక్రయించడం, తాజాగా డాలర్ ఇండెక్స్ తగ్గడంతో రూపాయి మళ్ళీ 90 మార్కు దిగువకు చేరి బలమైన స్థితిలోకి రావడం విశేషం.

Next Story