Rupee: తొలిసారి రూ. 90 మార్కుకు రూపాయి విలువ

by S Gopi |

డాలర్ ఇండెక్స్ 100 కంటే తక్కువగా ఉంది, కాబట్టి రూపాయి స్థిరంగా కొనసాగవచ్చని అన్నారు.

Rupee: తొలిసారి రూ. 90 మార్కుకు రూపాయి విలువ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి విలువ మరింత పతనం దిశగా సాగుతోంది. ఈ వారం ప్రారంభంలో రికార్డు కనిష్టానికి జారిన తర్వాత బుధవారం అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ తొలిసారి రూ. 90 మార్కును దాటి కొత్త కనిష్టాలకు చేరింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, భారతీయ రిజర్వ్ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కూడా ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోకపోవడంతో పాటు ఇతర కారణాల వల్ల గత కొన్ని రోజులుగా రూపాయి విలువ క్షీణిస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా దిగుమతిదారుల నుంచి డాలర్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం, ఎఫ్‌పీఐల నుంచి డాలర్ అవుట్‌ఫ్లోలు, ఎగుమతి వృద్ధి మందగించడంతో వాణిజ్య లోటు పెరుగుతుండటం రూపాయి పడిపోవడానికి ప్రధాన కారణాలని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ తెలిపారు. అయితే, డాలర్ ఇండెక్స్ 100 కంటే తక్కువగా ఉంది, కాబట్టి రూపాయి స్థిరంగా కొనసాగవచ్చని అన్నారు. రెండు మూడు రోజులుగా ఉన్న రూపాయి విలువ కొత్త బెంచ్‌మార్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లు రూ. 91 చేరవచ్చని అంచనా కడుతున్నప్పటికీ, ఈ వారంలో ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాల తర్వాత 88-89 స్థాయిల వద్ద స్థిరపడొచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీ కమొడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 90.19 వద్ద ఉంది.

మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ నష్టాలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 31.46 పాయింట్లు నష్టప్Yఇ 85,106 వద్ద, నిఫ్టీ 46.20 పాయింట్లు పడిపోయి 25,986 వద్ద ముగిశాయి. మన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకోవడం, మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, ఆర్‌బీఐ సమావేశం మొదలైన నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సూచీలు వరుసగా నాలుగో రోజు పతనమయ్యాయి. నిఫ్టీ తిరిగి 26 వేల మార్కు దిగువకు చేరింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. బీఈఎల్, టైటాన్, ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, టీఎంపీవీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి.

Next Story