- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rupee: తొలిసారి రూ. 91 మార్కు తాకిన రూపాయి విలువ
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద ప్రస్తుత పరిణామాలే దేశీయ కరెన్సీ విలువ పడిపోవడానికి కారణమని ప్రభుత్వం పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ మార్కెట్ల ముందు భారత రూపాయి వెలవెలబోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి క్షీణతను చూసిన భారత కరెన్సీ రూపాయి, మంగళవారం మరింత పతనమైంది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ప్రస్తుత పరిణామాలే దేశీయ కరెన్సీ విలువ పడిపోవడానికి కారణమని ప్రభుత్వం రాజ్యసభలో పేర్కొంది. మంగళవారం ఓ దశలో దేశీయ కరెన్సీ అమెరికా డాలర్‌తో పోలిస్తే 36 పైసలు బలహీనపడి రూ. 91.14 వద్ద అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ, సాయంత్రం సమయానికి రూ. 90.94 వద్ద కొత్త కనిష్టానికి చేరింది. డాలర్ బలహీనత, అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గడం కూడా దేశీయ కరెన్సీ పతనాన్ని ఆపలేకపోయాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. గత 10 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి డాలర్‌కు రూ. 90 నుంచి రూ. 91కి పడిపోయింది. కేవలం గత ఐదు సెషన్లలోనే రూపాయి డాలర్‌తో పోలిస్తే 1 శాతం క్షీణించింది.
మంగళవారం ఈ అంశం రాజ్యసభలో ప్రస్తావనకు రావడంతో, దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు పెరగడం, విదేశీ పెట్టుబడిదారుల నుంచి బలహీనమైన మద్దతు, అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందంలో జరుగుతున్న పరిణామాలు రూపాయి విలువ క్షీణతను ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. కరెన్సీ విలువ క్షీణించడం ఎగుమతుల్లో పోటీని పెంచుతుంది. ఇది పరోక్షంగా ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నట్టే. మరోవైపు, విలువ క్షీణత దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను పెంచవచ్చు. అయితే, మారకపు రేటు క్షీణత దేశీయ ధరలపై చూపే మొత్తం ప్రభావం, అంతర్జాతీయ వస్తువుల ధరలు దేశీయ మార్కెట్‌కు ఎంతమేరకు వస్తాయనే దానిపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు. 2015లో రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 4.5 శాతం, 2016లో 2.6 శాతం క్షీణించింది. ఆ తర్వాత 2017లో 6.4 శాతం పెరిగిందని డేటా చెబుతోంది. 2017 నుంచి రూపాయి విలువలో నిరంతర పతనం కొనసాగుతోంది. 2018లో 8.5 శాతం, 2019లో 2.3 శాతం, 2020లో 2.3 శాతం, 2021లో 1.7 శాతం, 2022లో 10.2 శాతం, 2023లో 0.6 శాతం, 2024లో 2.8 శాతం మేర పడిపోయిందని కేంద్ర మంత్రి చెప్పారు.
మరోవైపు, భారతీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడంతో పాటు బలహీన రూపాయి, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ వంటి అంశాలు నష్టాలకు కారణం. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 533.30 పాయింట్లు కుదేలై 84,679 వద్ద, నిఫ్టీ 167.20 పాయింట్లు క్షీణించి 25,860 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టైటాన్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఆల్ట్రా సిమెంట్ స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి.






