Crypto Scam: రూ. 79 లక్షల క్రిప్టో స్కామ్

by S Gopi |

మోసం జరిగిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత బాధితుడు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Crypto Scam: రూ. 79 లక్షల క్రిప్టో స్కామ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా కొత్త కొత్త మార్గాల్లో జరుగుతున్నాయి. ఇలాంటి డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ముంబైలోని మలేషియా కాన్సులేట్‌లో పనిచేసి ఓ అధికారి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పేరుతో జరిగిన మోసం కారణంగా ఏకంగా రూ. 79 లక్షలు పోగొట్టుకోవడం చర్చనీయాంశం అయింది. మోసం జరిగిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత బాధితుడు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ మేరకు ఈస్ట్ ముంబై సైబర్ పోలీసు అధికారులు వివరాలను వెల్లడించారు. ఈ ఘటనతో తాను తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని, సమాజంలో తన గౌరవానికి భంగం వాటిల్లుతుందని భయపడుతున్నట్టు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. 2024, జనవరిలో సదరు అధికారి స్టాక్, ట్రేడింగ్ చిట్కాలను అందించే 'ఈజీప్లాన్ ' అనే వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. మార్కెట్ల గురించి ఉన్న సాధారణ అవగాహనతో ఆ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లను నమ్మాడు. అందులో వచ్చే సలహాలను కూడా అనుసరించాడు. ఆ తర్వాత అసలైన స్కామ్ మొదలైంది. వాట్సాప్ గ్రూప్‌లోని వారు తమ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్, ఆర్‌టీజీఎస్ ద్వారా 18 కంటే ఎక్కువ వేర్వేరు బ్యాంకు అకౌంట్లకు డబ్బు బదిలీ చేయడం ప్రారంభించాడు.

మొదట, అధికారికి దాదాపు రూ. 1.69 లక్షల లాభాలు వచ్చాయి, ఇది మోసగాళ్లు నమ్మకం పంచుకోవడానికి ఉపయోగించి సాధారణ వ్యూహం. ఆ తర్వాత 2024, ఏప్రిల్ నుంచి 2025, జూన్ మధ్య పెట్టుబడులు కొనసాగేలా చేశారు. క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ నిజమైనదే అని నమ్మిన అధికారి దాదాపు రూ. 78.85 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే, ఆ సొమ్మును విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ బాగోతం బయటపడింది. దీనిపై వెబ్‌సైట్ వారిని అడిగితే 'ప్రాసెసింగ్ ఫీజు'గా మరో రూ. 18 లక్షలు చెల్లించాలని చెప్పారు. అక్కడితో వారిపై అనుమానం వచ్చిన బాధితుడు, స్కామ్ గురించి తెలుసుకుంది వారితో కాంటాక్టులను నిలిపేశాడు. ఈ వ్యవహారంపై పోలీసులు మోసం, నేరపూరిత కుట్ర, సైబర్ క్రైమ్ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Next Story