- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: ఒక్క ఏడాదిలో బంగారంపై రూ. 64 లక్షల కోట్లు సంపాదించిన భారతీయులు
దేశంలోని ఇళ్లలో బంగారం నిల్వలు 25,000 టన్నులకు చేరుకున్నాయని అంచనా.

దిశ, బిజినెస్ బ్యూరో: మన దేశంలో బంగారాన్ని ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తారు. ఆర్థిక స్థోమతకు తగినట్టుగా ఎంతోకొంత పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ముఖ్యంగా స్త్రీలకు పసిడి అతిపెద్ద సెంటిమెంట్. ఈ కారణంగానే సంప్రదాయం రూపంలో దేశంలో బంగారం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. బంగారానికి ఉండే విలువ అనేక ప్రధాన దేశాల కంటే అత్యధికం. ఇటీవలి హెచ్ఎస్‌బీసీ నివేదిక ప్రకారం, దేశంలోని ఇళ్లలో బంగారం నిల్వలు 25,000 టన్నులకు చేరుకున్నాయని అంచనా. సంపద రూపంలో బంగారంపై దేశం ఎంతటి పటిష్టమైన సాంస్కృతిక, ఆర్థిక పునాదులను కలిగి ఉందో ఈ గణాంకాలు సూచిస్తాయని నివేదిక అభిప్రాయపడింది. దీని ద్వారా దేశంలో కుటుంబాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు నిల్వను కలిగి ఉన్నాయి. ఇది కేవలం అలంకారం కోసమనే కాకుండా మహిళలు బంగారాన్ని ఒక వ్యూహాత్మక రక్షణ కవచంగా వాడుతున్నారు. ఇది మహిళలకు ఆర్థిక భద్రత, సాధికారతను ఇస్తుంది. ఇదే సమయంలో బంగారం ధరలు పెరుగుతున్న కొద్దీ, ఆ వారసత్వ సంపద కూడా పెరుగుతోంది.
తాజాగా, దేశంలోని కుటుంబాల వద్ద బంగారానికి సంబంధించి సెబీ నమోదిత విశ్లేషకుడు ఇచ్చిన డేటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో ఒక్క సంవత్సరంలో భారతీయ కుటుంబాలు బంగారంపై 750 బిలియన్ డాలర్ల( రూ. 64.17 లక్షల కోట్ల) సంపదను పెంచుకున్నారు. అంతేకాకుండా దేశంలో ప్రైవేట్ బంగారం నిల్వ అమెరికా, జర్మనీ, చైనా, ఆర్‌బీఐతో సహా ప్రపంచంలో టాప్-10 సెంట్రల్ బ్యాంకుల సంయుక్త నిల్వల కంటే అత్యధికంగా ఉన్నాయని విశ్లేషకుడు ఎకె మంథన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
2024, సెప్టెంబరులో బంగారం 10 గ్రాములు రూ.75,549 వద్ద ఉంది. అప్పటికి ఉన్న వాటి నిల్వ విలువ దాదాపు రూ. 188.9 లక్షల కోట్లకు సమానం. ఆ తర్వాత నుంచి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. గతేడాది ఏప్రిల్‌లో రూ. 68,420 నుంచి 2025, మార్చి నాటికి పది గ్రాముల బంగారం రూ. 92,150 గరిష్ఠ స్థాయిలకు చేరాయి. ఈ సమయంలో బంగారం ధరలు 35 శాతం పెరిగాయి. ఫలితంగా కేవలం తొమ్మిది నెలల కాలంలో దేశంలోని కుటుంబాల వద్ద ఉన్న 25,000 టన్నుల పసిడిపై 400 బిలియన్ డాలర్ల(రూ. 34.22 లక్షల కోట్ల) సంపద వృద్ధి చెందింది. పూర్తి ఏడాదికి ఈ బంగారంపై రూ. 64 లక్షల కోట్లకు పైగా సంపద పెరగడం గమనార్హం. దేశంలో చాలా కుటుంబాలకు బంగారం ఎంతో కాలంగా ద్రవ్యోల్బణం, కరెన్సీ మార్పులు, ఆర్థిక సంక్షోభం వంటి అనేక సవాళ్ల నుంచి రక్షణగా నిలిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బంగారం అధికారిక బ్యాంకింగ్ అవసరాలకు ప్రత్యామ్నాయంగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.






