Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట

by S Gopi |

ఏజీఆర్‌ బకాయిలపై పునఃపరిశీలనకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిన ప్రత్యేక కమిటీ ద్వారా ఈ మదింపు జరిగింది.

Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రైవేట్ రంగ వొడాఫోన్ ఐడియాకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. టెలికాం విభాగం వొడాఫోన్ ఐడియా (వీఐ) సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలను రూ. 64,046 కోట్లకు తగ్గించింది. ఇది ముందుగా అంచనా వేసిన రూ. 87,695 కోట్లతో పోలిస్తే రూ. 23,649 కోట్లు తగ్గింది. ఏజీఆర్‌ బకాయిలపై పునఃపరిశీలనకు సుప్రీంకోర్టు అనుమతిచ్చిన ప్రత్యేక కమిటీ ద్వారా ఈ మదింపు జరిగింది. తాజా సవరణ వీఐకి తక్షణ ఉపశమం కానుంది. ముఖ్యంగా నగదు కొరత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కంపెనీకి, ఈ బకాయిలను ఇప్పటికిప్పుడు కాకుండా, సుదీర్ఘ కాలం పాటు చెల్లించే వెసులుబాటు కల్పించారు. డీఓటీ ప్రకారం, 2032 నుంచి 2035 వరకు ఏడాదికి కనిష్టంగా రూ. 100 కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు చెల్లించాలి. 2036 నుంచి 2041 వరకు మిగిలిన బకాయి మొత్తాన్ని ఆరు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించేలా షెడ్యూల్ రూపొందించారు.

దీనివల్ల వీఐకి తక్షణ ఆర్థిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, నెట్‌వర్క్ విస్తరణ, కస్టమర్ బేస్ పెంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యంగా, 2026, మార్చి నాటికి కట్టాల్సిన రూ. 16,400 కోట్ల ఒత్తిడి మధ్య ఈ నిర్ణయం కంపెనీకి అతిపెద్ద ఉపశమనం అవుతుంది. అయితే, వొడాఫోన్ ఐడియాకు సమస్యలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇప్పటికీ సుమారు రూ. 2 లక్షల కోట్ల భారీ రుణ భారాన్ని మోస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం సంస్థను నిలబెట్టేందుకు పలు చర్యలు తీసుకుంది. బకాయిలను ఈక్విటీగా మార్చడం ద్వారా తన వాటాను 48.99 శాతానికి పెంచుకుంది. ఈ నేపథ్యంలో తాజా ఏజీఆర్ తగ్గింపు వీఐకి మరో కీలక సాయంగా ఉంటూ, దేశీయ టెలికాం మార్కెట్‌లో పోటీ కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తోంది.

Next Story