Rs 2000 notes: రూ.5,884 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల్లో చేతుల్లోనే

by S Gopi |   (  Updated:2025-10-03 12:56:59  IST  )

చలామణీలో ఉన్న వాటిల్లో 98.35 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్టు ఆర్‌బీఐ పేర్కొంది.

Rs 2000 notes: రూ.5,884 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఇంకా ప్రజల్లో చేతుల్లోనే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రూ.2,000 విలువైన కరెన్సీ నోటును భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ఉపసంహరించుకుని రెండేళ్లకు పైనే అయ్యింది. అయినప్పటికీ ఇంకా రూ.5,884 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని బుధవారం నాటి ప్రకటనలో ఆర్‌బీఐ వెల్లడించింది. చలామణీలో ఉన్న వాటిల్లో 98.35 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. రూ.2,000 విలువైన నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు 2023, మే 19న ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రకటన వెలువడే సమయానికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. మొదట బ్యాంకుల్లో నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేయడానికి ప్రజలకు 2023, సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని అదే ఏడాది అక్టోబర్‌ 7 వరకు గడువును పొడిగించారు. అనంతరం నుంచి ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే రూ. 2 వేల నోట్లను స్వీకరిస్తున్నారు. ఆ విధంగా సెప్టెంబర్ 30 నాటికి 98.35 శాతం నోట్లు బ్యాంకులకు చేరాయని ఆర్‌బీఐ పేర్కొంది. ఆర్‌ఐబీ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునేందుకు అవకాశం లేనివారు పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఆయా కార్యాలయాలకు పోస్ట్ ద్వారా పంపవచ్చని ఆర్‌బీఐ వెల్లడించింది.

Next Story