RBI: ఇంకా రూ.6,000 కోట్లకు పైగా విలువైన పెద్ద నోట్లు ప్రజల వద్దే

by S Gopi |

శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇప్పటివరకు 98.24 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని పేర్కొంది.

RBI: ఇంకా రూ.6,000 కోట్లకు పైగా విలువైన పెద్ద నోట్లు ప్రజల వద్దే
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రూ. 2,000 విలువైన పెద్ద నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ రూ. 6 వేల కోట్లకు పైగా విలువైన పెద్ద నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. శుక్రవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఇప్పటివరకు 98.24 శాతం నోట్లు వెనక్కి వచ్చాయని, ఇంకా రూ. 6,266 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు వ్యవస్థలో చెలామణి అవుతున్నాయని ఆర్‌బీఐ పేర్కొంది. 2023, మే 19న ఆర్‌బీఐ పెద్ద నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ సమయానికి వ్యవస్థలో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉండగా, 2025, ఏప్రిల్ 30 నాటికి రూ. 6,266 కోట్లకు తగ్గాయి. ఉపసంహరణ సమయంలో ఆ ఏడాది అక్టోబర్ వరకు రూ. 2,000 విలువైన నొట్లను బ్యాంకుల్లో లేదా ఆర్‌బీఐ కార్యాలయాల్లో డిపాజిట్/మార్పిడి కోసం ఆర్‌బీఐ వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత పలు దఫాలుగా గడువు పొండిగించిన తర్వాత, ప్రస్తుతం ఆర్‌బీఐ కార్యాలయాల్లో ఈ సౌకర్యాన్ని కొనసాగిస్తోంది. పోస్ట్ ఆఫీసు నుంచి ఆర్‌బీఐ ఆఫీసులకు పోస్టల్ ద్వారా పంపే సదుపాయాన్ని కూడా ఆర్‌బీఐ కల్పిస్తోంది. కాగా, రూ. 2,000 నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, వాటి చట్టబద్ధత కొనసాగుతుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

Next Story