OMCs: రోజుకు 1,700 కోట్ల నష్టం

by S Gopi |

సంస్థలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ను వాస్తవంగా ఖర్చయ్యే దానికంటే తక్కువ ధరలకే సరఫరా చేస్తున్నాయి. ఫలితంగా కంపెనీలు రోజుకు రూ.1,600-1,700 కోట్ల వరకు నష్టాలను చూస్తున్నాయి.

OMCs: రోజుకు 1,700 కోట్ల నష్టం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం కారణంగా దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వినియోగదారులపై ధరల భారం పడకుండా కాపాడుతున్నాయి. దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇండియన్ ఆయిల్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) సంస్థలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ను వాస్తవంగా ఖర్చయ్యే దానికంటే తక్కువ ధరలకే సరఫరా చేస్తున్నాయి. ఫలితంగా కంపెనీలు రోజుకు రూ.1,600-1,700 కోట్ల వరకు నష్టాలను చూస్తున్నాయి. గత 10 వారాల్లో ఈ నష్టం మొత్తం రూ. లక్ష కోట్లను దాటినట్లు సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం రెండేళ్ల నాటి స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇటీవల ఎల్‌పీజీ సిలిండర్ ధరలను పెంచినా, అవి ఇంకా మార్కెట్ ధరల కంటే తక్కువగానే ఉన్నాయి. ఇతర దేశాలు ఇంధన ధరలను 30 శాతం వరకు పెంచినప్పటికీ, భారత్‌లో ధరలను నియంత్రించడం ద్వారా ప్రభుత్వం ప్రజలపై ద్రవ్యోల్బణ భారం తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

అయితే, ఈ పరిస్థితుల్లో చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. నిధుల కోసం అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల రిఫైనరీ విస్తరణలు, పైప్‌లైన్ ప్రాజెక్టులు, ఇంధన భద్రతా మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వంటి కీలక పెట్టుబడులు ఆలస్యం కావచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇంధన ధరలను నియంత్రించడం ఎంతకాలం సాధ్యమవుతుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడి చమురు ధరలు ఇంకా ఇదే స్థాయిలో కొనసాగితే, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Next Story