Road Accident: రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స

by S Gopi |

అన్ని ఆసుపత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉత్తర్వుల్లో వివరించింది

Road Accident: రోడ్డు ప్రమాద బాధితులకు రూ. 1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద సంఘటన జరిగిన ఏడు రోజుల్లోపు ఆసుపత్రులలో చికిత్స కోసం ఒక్కో వ్యక్తికి రూ. 1.50 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. ఈ మేరకు సోమవారం కేంద్ర రవాణా, రహదారుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయం మే 5 నుంచే అమల్లోకి వచ్చినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఏదైనా రహదారిపై వాహనం కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన ఏ వ్యక్తి అయినా, అతని స్థాయి, వర్గంతో సంబంధం లేకుండా ఈ నగదు రహిత చికిత్సకు అర్హులు అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా రోగులకు ట్రామా, పాలీట్రామా సేవలను అందించగలిగే అన్ని ఆసుపత్రులను ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉత్తర్వుల్లో వివరించింది. ప్రమాదంలో దెబ్బతిన్న వ్యక్తి ఆసుపత్రిని తెచ్చిన వెంటనే వైద్య సేవలు అందాలి. మెరుగైన సౌకర్యాలు లేకపోతే తక్షణం మరో ఆసుపత్రికి తరలించాలి. దానికోసం ఆ ఆసుపత్రి వర్గాలే ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యాక వైద్య సేవలు అందించిన ఆసుపత్రి దానికి సంబంధించిన బిల్లును ప్రభుత్వ పోర్టల్‌లో అందించాలి.

ఓ కేసుకు సంబంధించి జనవరి నెలలో సుప్రీంకోర్టు రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణం ఉచిత వైద్యం అందించాలని తీర్పు వెలువరించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీని గురించి ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి 'క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీమ్-2025' అని పేరు పెట్టింది. నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్ఏ) ఈ ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేసే ఏజెన్సీగా పనిచేయనుంది. పోలీసులు, ఆసుపత్రులు, రాష్ట్ర ఆరోగ్య సంస్థల సహకారంతో ఎన్‌హెచ్ఏ పనిచేస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి ఈ పథకం అమలుకు బాధ్యత వహించే నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.

Next Story