అన్ని పాన్ మసాలా ప్యాకేజీలపైనా రిటైల్ ధర తప్పనిసరి

by S Gopi |

ఈ నిబంధన 2026, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

అన్ని పాన్ మసాలా ప్యాకేజీలపైనా రిటైల్ ధర తప్పనిసరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని పాన్ మసాలా వ్యాపారులకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారు చేసే అన్ని పాన్ మసాలా ప్యాకేజీలు పరిమాణం లేదా బరువుతో సంబంధం లేకుండా లీగల్ మెట్రాలజీ(ప్యాకేజ్‌డ్ కమోడిటీస్) రూల్స్-2011 ప్రకారం, రిటైల్ సేల్ ధర(ఆర్ఎస్‌పీ), ఇతర తప్పనిసరి డిక్లరేషన్లను ప్యాకేజీపై కనబడేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన 2026, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. నిదేశించిన తేదీ నుంచి పాన్ మసాలా తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులందరూ దీన్ని అమలు చేసేలా చూసుకోవాలని అధికారిక ప్రకటనలో ఆ శాఖ పేర్కొంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో గతంలో 10 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువున్న చిన్న ప్యాక్‌లు కొన్ని డిక్లరేషన్‌ల నుంచి పొందిన మినహాయింపును కూడా కోల్పోతాయి. ఇప్పుడు, ఈ చిన్న ప్యాక్‌లు కూడా వాటి లేబుల్‌లపై రిటైల్ సేల్ ధరను ముద్రించాలి, 2011 నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని డిక్లరేషన్‌లను ప్రదర్శించాలి. ఈ నిర్ణయం వల్ల అన్ని ప్యాక్ పరిమాణాలలో పారదర్శక ధరల సమాచారం గురించి వినియోగదారులకు తెలుస్తుందని వినియోగదారుల వ్యవహారాల విభాగం తెలిపింది. చిన్న ప్యాక్‌లపై తప్పుదారి పట్టించే లేదా మోసపూరిత ధరలను నివారించడానికి, వినియోగదారులు సరైన సమాచారంతో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో నిర్ణయం తీసుకునేందుకు సహాయపడుతుందని విభాగం పేర్కొంది.

Next Story