Retail Inflation: ఆరేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |

ఇందుకు ఆహార పదార్థాల ధరల్లో గణనీయమైన తగ్గుదల, బేస్ ఎఫెక్ట్ అనుకూలంగా ఉండటమేనని గణాంకాలు తెలిపాయి.

Retail Inflation: ఆరేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జూన్ నెలలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఏకంగా ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. సోంవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సమీక్షించిన నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.10 శాతానికి తగ్గిందని, ఇందుకు ఆహార పదార్థాల ధరల్లో గణనీయమైన తగ్గుదల, బేస్ ఎఫెక్ట్ అనుకూలంగా ఉండటమేనని గణాంకాలు తెలిపాయి. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతం కంటే దిగువన నమోదవడం ఇది వరుసగా ఐదో నెల కావడం విశేషం. అంతకుముందు మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతం, 2024, జూన్‌లో 5.08 శాతంగా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణ సూచీలో ముఖ్యమైన ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం జూన్‌లో -1.06 శాతం వద్ద ఉంది. అంతకుముందు నెలలో 0.99 శాతం కంటే మరింత తగ్గింది. ఇక, కూరగాయల ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మేలో 13.7 శాతం తగ్గాయి. ఆర్‌బీఐ తన ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో కీలక రెపో రేటును 50 శాతం పాయింట్లు తగ్గించి 5.5 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే.

మైనస్‌లోకి టోకు ద్రవ్యోల్బణం

దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ప్రతికూలంగా అంటే మైనస్ 0.13 శాతంగా నమోదైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక డేటాను విడుదల చేసింది. ఇది 20 నెలల కనిష్టమని గణాంకాలు పేర్కొన్నాయి. చివరిగా 2023, ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం ప్రతికూలంగా నమోదైంది. అంతకుముందు కొవిడ్-19 ప్రారంభంలో 2020, జూలైలోనూ డబ్ల్యూపీఐ ప్రతికూలంగా ఉంది. ఈ జూన్ నెలకు సంబంధించి ప్రధానంగా ఆహార పదార్థాలు, మినరల్ ఆయిల్, ముడి పెట్రోలియం, సహజ వాయువు ధరలు తగ్గడం ఇందుకు నేపథ్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Next Story