Inflational: ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |
Inflational: ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో గణనీయంగా తగ్గింది. అంతకుముందు ఫిబ్రవరి నెలలో 3.61 శాతానికి దిగొచ్చిన వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ), గత నెలలో ఏకంగా ఐదేళ్ల కనిష్టానికి చేరుకుంది. మంగళవారం కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మార్చి నెలలో 3.34 శాతానికి తగ్గింది. 2019, ఆగష్టు తర్వాత ఇదే కనిష్టం కావడం గమనార్హం. ప్రధానంగా ఆహార పదార్థాల ధరలు క్షీణించడంతోనే సీపీఐ ద్రవ్యోల్బణం పతనమైంది. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ధరలు 3.75 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గాయి. ఇది 2021, నవంబర్ తర్వాత కనిష్టమని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ముఖ్యంగా కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, తృణ ధాన్యాలు, పాల ఉత్పత్తుల ధరలు దిగిరావడం ఈ క్షీణతకు కారణమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 3.25 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 2.82 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం దిగొచ్చింది. ఫిబ్రవరి నెలలో 3.32 శాతం నుంచి 3.43 శాతానికి చేరుకుంది. ఆహార ద్రవ్యోల్బణం సైతం 3.15 శాతం నుంచి 2.48 శాతానికి పడిపోయింది.

2.05 శాతానికి టోకు ద్రవ్యోల్బణం

టోకు ద్రవ్యోల్బణం సైతం మార్చి నెలలో నాలుగు నెలల కనిష్టం 2.05 శాతానికి తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇది ఫిబ్రవరిలో నమోదైన 2.38 శాతం, ఆర్థిక వేత్తలు అంచనా వేసిన 2.5 శాతం కంటే చాలా తక్కువ. తయారీ వస్తువుల ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆహారం, ఇంధనం, విద్యుత్ ధరలు తగ్గడంతో టోకు ద్రవ్యోల్బణం తగ్గింది. కూరగాయల దిగుబడి పెరిగిన కారణంగా ఇటీవలి నెలల్లో హోల్‌సేల్ మార్కెట్లో ఆహార పదార్థాల ధరలు 15.88 శాతం తగ్గాయి.

Next Story

Most Viewed