- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Retail Inflation: జనవరిలో 5 నెలల కనిష్టానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం
జనవరి నెలలో ఆహార పదార్థాల ధరలు కొంత శాంతించడంతో ద్రవ్యోల్బణానికి కలిసొచ్చిందని గణాంకాలు తెలిపాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం దిగొచ్చింది. ఈ ఏడాది మొదటి నెలలో ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి తగ్గినట్టు డేటా వెల్లడించింది. బుధవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, గతేడాది డిసెంబర్‌లో 5.22 శాతంగా నమోదైన వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జనవరి నెలలో 4.31 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో 3.87 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 4.64 శాతం ఉంది. జనవరి నెలలో ఆహార పదార్థాల ధరలు కొంత శాంతించడంతో ద్రవ్యోల్బణానికి కలిసొచ్చిందని, అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం 6.02 శాతంతో అధికంగానే ఉందని గణాంకాలు తెలిపాయి. ప్రధానంగా కూరగాయలు, వంటనూనె, పండ్ల ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. కూరగాయల ధరలు డిసెంబర్‌లో 26.6 శాతం నుంచి గత నెల్లో 11.35 శాతానికి తగ్గాయి. 2022, ఏప్రిల్‌లో భారత రిటైల్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 7.79 శాతానికి పెరిగింది. అయితే, ఆ తర్వాత ఆర్‌బీఐతో పాటు ప్రభుత్వ చర్యల ఫలితంగా తగ్గింది. కానీ, ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉండటంతో సామాన్యుల కొనుగోలు శక్తిని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. దానివల్ల రిటైల్ ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగింది. మరోవైపు గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) స్వల్పంగా తగ్గింది. నవంబర్‌లో 4.96 శాతంగా నమోదైన ఐఐపీ డిసెంబర్‌లో 3.21 శాతానికి తగ్గింది. సమీక్షించిన నెలలో తయారీ రంగ ఉత్పత్తి 3 శాతం, విద్యుదుత్పత్తి 6.2 శాతం, మైనింగ్ 2.6 శాతం మేర వృద్ధిని నమోదు చేశాయని గణాంకాలు పేర్కొన్నాయి.






