Retail Inflation: ఆరేళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

by S Gopi |

గత నెలలో నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం 2019, జూలై తర్వాత కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

Retail Inflation: ఆరేళ్ల కనిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అంతకుముందు నెలలో ఆర్‌బీఐ లక్ష్యం కంటే దిగువకు చేరిన తర్వాత ఏప్రిల్ నెలలో 6 సంవత్సరాల కనిష్ఠానికి తగ్గింది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ద్రవ్యోల్బణం 3.16 శాతంగా నమోదైంది. అంతకుముందు మార్చిలో ద్రవ్యోల్బణం 3.34 శాతంగా ఉంది. గత నెలలో నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం 2019, జూలై తర్వాత కనిష్ట స్థాయి కావడం గమనార్హం. దీంతో సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) లక్ష్యం 4 శాతం కంటే తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా వేడిగాలులు ఉన్నప్పటికీ పంట దిగుబడి పెరగడంతో కూరగాయల ధరలు తగ్గాయని, ఇది మొత్తం ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపాయని విశ్లేషకులు తెలిపారు. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 2.69 శాతం నుంచి 1.78 శాతానికి తగ్గింది. ఇది 2021, అక్టోబర్ తర్వాత కనిష్టం. ఈ తగ్గుదల ప్రధానంగా కూరగాయలు, ధాన్యాలు, పండ్లు, మాంసం, చేపలు, తృణ ధాన్యాల కారణంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 3.25 శాతం నుంచి 2.92 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 3.43 శాతం నుంచి 3.36 శాతానికి దిగొచ్చింది.

Next Story