Anil Ambani: కెనరా బ్యాంక్ అకౌంట్ కేసులో అనిల్ అంబానీకి ఉపశమనం

by S Gopi |

ఒక వ్యక్తి ఖాతాను మోసపూరితమైనదిగా పదేపదే ప్రకటించే బ్యాంకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ఆదేశించింది.

Anil Ambani: కెనరా బ్యాంక్ అకౌంట్ కేసులో అనిల్ అంబానీకి ఉపశమనం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కెనరా బ్యాంక్ అకౌంట్ కేసులో అనిల్ అంబానీకి బాంబే హైకోర్టు ఉపశమనం కల్పించింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి ఖాతాను మోసపూరితమైనదిగా పదేపదే ప్రకటించే బ్యాంకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. తన లోన్ అకౌంట్‌ను సరైన విచారణకు అవకాశం ఇవ్వకుండా మోసపూరితమైనదని కెనరా బ్యాంకు చెబుతోందని పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు రేవతి మోహితే-దేరే, నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా అంబానీ ఖాతా మోసపూరితమైనదిగా ప్రకటిస్తూ కెనరా బ్యాంక్‌ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఒక ఖాతా మోసపూరితమైనదిగా ప్రకటించినప్పుడు, దానివల్ల తీవ్రమైన ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయని కోర్టు అభిప్రాయపడింది.

బ్యాంకులు ఆర్‌బీఐ మాస్టర్ సర్క్యులర్, సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండటం లేదని తెలుస్తోంది. ఖాతాదారులకు తమ ఖాతాలు మోసపూరితమైనవిగా ప్రకటించబడటానికి ముందు వారి వాదనను సమర్పించడానికి అవకాశం కల్పించాలని పేర్కొంది. ఇదే అంశంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయని, పదే పదే ఈ సమస్య పునరావృతమవుతోందని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని, ప్రజల సొమ్ముకు సంబంధించిన అంశం కాబట్టి ఏం చేయాలనేది సరిచూసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనీల్ అంబానీ వ్యవహారంలో ఆర్‌బీఐని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించిన ధర్మాసనం విచారణను మార్చి 6కి వాయిదా వేసింది. 2017లో రూ.1,050 కోట్లను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, అంబానీకి చెందిన దివాలా తీసిన టెలికాం వెంచర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్. దాని అనుబంధ సంస్థ రుణ ఖాతాలను కెనరా బ్యాంక్ మోసపూరితంగా పేర్కొంది.

Next Story