- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Reliance: అత్యధిక విలువైన ప్రపంచ టెక్ కంపెనీల జాబితాలో ఏకైక భారతీయ సంస్థ రిలయన్స్
ఈ నివేదిక ప్రపంచ టెక్ సంస్థలను మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా జాబితాలో చోటు కల్పిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అరుదైన ఘనతను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్-30 గ్లోబల్ టెక్నాలజీ కంపెనీల జాబితాలో ఏకైక భారతీయ సంస్థగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ సంస్థ చోటు సంపాదించుకుంది. ఏఐ టెక్నాలజీని అత్యంత వేగంగా స్వీకరించడం, ప్రభావితం చేసే స్థాయిలో పరివర్తన చెందడం వంటి విషయాల్లో రిలయన్స్ సంస్థ ముందుందని 'ట్రెండ్స్ - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' పేరుతో వెలువైన నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రపంచ టెక్ సంస్థలను మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా జాబితాలో చోటు కల్పిస్తుంది. ఇందులో మొదటి ఎనిమిది స్థానాలను అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా ప్లాట్‌ఫామ్స్, టెస్లా, బ్రాడ్‌కామ్ దక్కించుకున్నాయి.
తైవాన్‌కు చెందిన టీఎస్ఎంసీ 9వ స్థానంలో ఉండగా, చైనాకు చెందిన టెన్సెంట్ తర్వాతి స్థానంలో ఉంది. 216 బిలియన్ డాలర్ల(రూ. 18.43 లక్షల కోట్ల) మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రిలయన్స్ 23వ స్థానంలో ఉంది. గత 30 సంవత్సరాలలో (1995-2025), కేవలం ఐదు కంపెనీలు మాత్రమే పబ్లిక్ ట్రేడింగ్‌లో ఉన్న టాప్ 30 గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలలో ఉన్నాయి. అవి మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సిస్కో, ఐబీఎం, ఏటీఅండ్‌టీ అని నివేదిక పేర్కొంది. కొత్తగా చోటు సంపాదించిన వాటిలో రిలయన్స్, ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, మెటా, టెస్లా, అలీబాబా, సేల్స్‌ఫోర్స్, చైనా మొబైల్ కంపెనీలున్నాయి. 1995లో అత్యంత విలువైన టెక్ కంపెనీలలో అమెరికా వాటా 53 శాతం (30లో 16) నుంచి 2025లో 70 శాతానికి (30లో 21) పెరిగాయి. 2025లో కొత్తగా ప్రవేశించిన వాటిలో చైనా నుంచి 3, జర్మనీ(2), తైవాన్(1), నెదర్లాండ్స్(1), దక్షిణ కొరియా(1), ఇండియా(1) ఉన్నాయి.






