TRAI: జూన్‌లో కొత్తగా 19 లక్షల సబ్‌స్క్రైబర్లను సాధించిన జియో

by S Gopi |

వొడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ క్రమంగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతున్నాయి.

TRAI: జూన్‌లో కొత్తగా 19 లక్షల సబ్‌స్క్రైబర్లను సాధించిన జియో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా జూన్ నెలకు సంబంధించి టెలికాం సబ్‌స్క్రైబర్ల డేటాలో భారతీ ఎయిర్‌టెల్ కంటే రెండు రెట్లు ఎక్కువగా కొత్త కస్టమర్లను జియో సంపాదించినదని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించింది. మంగళవారం విడుదల చేసిన డేటా ప్రకారం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ క్రమంగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతున్నాయి. సమీక్షించిన నెలలో జియో కొత్తగా 19 లక్షల మంది కస్టమర్లను సంపాదించుకోగా, ఎయిర్‌టెల్ 7.63 లక్షల మందిని చేర్చుకుంది. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా 2.18 లక్షల మందిని, బీఎస్ఎన్ఎల్ 3.06 లక్షల మందిని కోల్పోయాయని ట్రాయ్ వెల్లడించింది. మొత్తంగా జూన్‌లో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు 20 లక్షల మంది పెరిగారు. తద్వారా దేశంలోని మొత్తం యూజర్ బేస్ 116.3 కోట్లకు చేరుకుంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లెస్ యూజర్ బేస్ 5.1 లక్షల మంది తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో 29.7 లక్షల మంది పెరిగారు. జూన్ నాటికి జియో మొత్తం 47.7 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. దీని తర్వాత ఎయిర్‌టెల్, 39.1 కోట్లు, వొడాఫోన్ ఐడియా 20.42 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.05 కోట్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి. రిలయన్స్ జియో 41.02 శాతం మార్కెట్ వాటాతో దేశీయ టెలికాం మార్కెట్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఎయిర్‌టెల్ 33.62 శాతం, వొడాఫోన్ ఐడియా 17.56 శాతం, బీఎస్ఎన్ఎల్ 7.78 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి.

Next Story