Reliance: బ్యాటరీ సెల్ తయారీని నిలిపేసిన రిలయన్స్

by S Gopi |

సెల్ టెక్నాలజీకి సంబంధించి లైసెన్స్ ఇవ్వడానికి చైనా ఇంధన నిల్వ సంస్థ జియామెన్ హిథియం ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీతో రిలయన్స్ చర్చలు జరిగాయి.

Reliance: బ్యాటరీ సెల్ తయారీని నిలిపేసిన రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది లిథియం-అయాన్ బ్యాటరీ సెల్ తయారీని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ప్రణాళికలను నిలిపేసినట్టు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. సెల్ టెక్నాలజీకి సంబంధించి లైసెన్స్ ఇవ్వడానికి చైనా ఇంధన నిల్వ సంస్థ జియామెన్ హిథియం ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీతో రిలయన్స్ చర్చలు జరిగాయి. అయితే, విదేశీ టెక్నాలజీ బదిలీలపై చైనా ఆంక్షలు విధించిన తర్వాత జియామెన్ భాగస్వామ్యం నుంచి వైదొలిగిన నేపథ్యంలో చర్చలు నిలిచిపోయాయని, రిలయన్స్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను అసెంబుల్ చేయడంపై తిరిగి దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. గతేడాది అక్టోబర్‌లో, చైనా లిథియం బ్యాటరీ విడిభాగాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. ఎగుమతిదారులు అనుమతులు పొందాలని ఆదేశించింది. దీంతో ఇంధన నిల్వ, ఎలక్ట్రిక్ వాహనాలకు కీలకమైన సాంకేతికతపై నిబంధనలు చైనా కఠినతరం చేసింది. దీనిపై స్పందించిన రిలయన్స్ సంస్థ బ్యాటరీ సెల్స్ తయారీ ఆగిపోయిందనే కథనాలను తిరస్కరించింది. కంపెనీ బ్యాటరీ స్టోరేజ్ తయారీ ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు లేవని, ట్రాక్‌లోనే ఉన్నాయని స్పష్టం చేసింది. సెల్ తయారీ నుంచి ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (ఈఎస్ఎస్) వరకు పూర్తి ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనే తమ లక్ష్యాలు కొనసాగుతాయని, ఆలస్యం కూడా ఉండదని పేర్కొంది.

Next Story