ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం..బ్లూమ్‌బెర్గ్ వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటన

by Malleboina Mahesh |   (  Updated:2026-01-06 04:57:53  IST  )

రష్యా ఆయిల్‌తో కూడిన మూడు నౌకలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీకి వస్తున్నాయి" అని బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) వార్తలను ప్రచురించింది.

ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం..బ్లూమ్‌బెర్గ్ వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా ఆయిల్‌ (Russian Oil)తో కూడిన మూడు నౌకలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ (Jamnagar Refinery)కి వస్తున్నాయి" అని బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) వార్తలను ప్రచురించింది. ఈ వార్తలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) గుజరాత్‌లోని తమ జామ్‌నగర్ రిఫైనరీకి రష్యా ఆయిల్‌తో కూడిన మూడు నౌకలు వస్తున్నాయంటూ ప్రచురించిన వార్తను తీవ్రంగా ఖండించింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం, దాదాపు 2.2 మిలియన్ బ్యారెల్స్ రష్యా ముడి చమురుతో కూడిన నౌకలు జామ్‌నగర్ రిఫైనరీకి చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. కానీ ఈ వార్త పూర్తిగా "అవాస్తవం" (Blatantly Untrue) అని రిలయన్స్ స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులపై అంతర్జాతీయంగా నిఘా పెరిగిన తరుణంలో, ఈ తప్పుడు వార్త తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని రిలయన్స్ పేర్కొంది.

గత మూడు వారాలుగా జామ్‌నగర్ రిఫైనరీకి రష్యా నుండి ఎలాంటి ఆయిల్ కార్గో రాలేదని, అలాగే జనవరిలో కూడా రష్యా ముడి చమురు డెలివరీలను తాము ఆశించడం లేదని రిలయన్స్ స్పష్టమైన వివరణ ఇచ్చింది. జనవరి డెలివరీల కోసం తాము రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేయడం లేదని బ్లూమ్‌బెర్గ్‌కు ముందే చెప్పినప్పటికీ, ఆ విషయాన్ని విస్మరించి తప్పుడు వార్తను ప్రచురించడం పట్ల రిలయన్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. నిజాయితీ గల జర్నలిజం పాటిస్తామని చెప్పుకునే వారు ఇలా చేయడం విచారకరమని రిలయన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా (X) వెల్లడించింది.

Read More..

అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం.. SBI నివేదిక

Next Story