- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Reliance: 1963 నాటి ఫ్రిడ్జ్ బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్
కెల్వినేటర్ కంపెనీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ సహా పలు గృహోపకరణాలను తయారు చేస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ, ఈషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న కన్స్యూమర్ డ్యూరబుల్ మార్కెట్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రముఖ కన్స్యూమర్ బ్రాండ్ కెల్వినేటర్‌ను కొనుగోలు చేసినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ కొనుగోలు విలువ ఎంతనేది కంపెనీ ఇంకా చెప్పాల్సి ఉంది. కెల్వినేటర్ కంపెనీ రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ సహా పలు గృహోపకరణాలను తయారు చేస్తుంది. దేశీయ మార్కెట్లో ప్రీమియం హోమ్ అప్లయన్సెస్‌కు గిరాకీ వేగంగా పెరుగుతోందని, ఇలాంటి తరుణంలో కెల్వినేటర్‌ను సొంతం చేసుకోవడం ద్వారా మార్కెట్ వాటా సొంతమవుతుందని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా కెల్వినేటర్ బ్రాండ్‌కు ఉన్న నెట్‌వర్క్, దశాబ్దాల అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని రిలయన్స్ రిటైల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ చెప్పారు. కెల్వినేటర్ బ్రాండ్ 1963లో భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. వచ్చిన తక్కువగా కాలంలోనే దేశంలోని ప్రతి ఇంటికి పరిచయం అయిన బ్రాండ్‌గా నిలిచింది. ప్రధానంగా 1970, 80లలో 'ది కూలెస్ట్ వన్' అనే ట్యాగ్‌లైన్‌తో భారత మార్కెట్లో గోద్రేజ్ లాంటి బ్రాండ్‌ను అధిగమించి ఆధిపత్యం సాధించింది. అత్యాధునిక టెక్నాలజీ వినియోగం, మన్నిక, మెరుగైన పనితీరు, నాణ్యతకు సంబంధించి కెల్వినేటర్ ఒకప్పుడు ప్రజల మన్నన అందుకుంది. ఆ తర్వాత 1990ల ఆర్థిక సంస్కరణలు, శాంసంగ్ లాంటి గ్లోబల్ దిగ్గజ బ్రాండ్ల ఎంట్రీతో తీవ్రమైన పోటీ కారణంగా కెల్వినేటర్ క్రమంగా మార్కెట్ వాటాను కోల్పోతూ వచ్చింది.






