Reliance Industries: ప్రధాని మోడీయే దేశానికి 'అజేయమైన రక్షణ కవచం'

by S Gopi |

రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడిని రూ. 7 లక్షల కోట్లకు రెట్టింపు చేస్తామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.

Reliance Industries: ప్రధాని మోడీయే దేశానికి అజేయమైన రక్షణ కవచం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆదివారం గుజరాత్‌లో భారీ పెట్టుబడులను ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తామని చెబుతూనే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. రాజ్‌కోట్‌లో ఆదివారం ప్రారంభమైన వైబ్రంట్‌ గుజరాత్‌ రీజినల్‌ (కచ్‌ అండ్‌ సౌరాష్ట్ర) సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రిలయన్స్ ఇప్పటికే రాష్ట్రంలోనే అతిపెద్ద పెట్టుబడిదారుగా ఉంది. గత ఐదేళ్లలో, మేము రూ. 3.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాము. రాబోయే ఐదేళ్లలో ఈ పెట్టుబడిని రూ. 7 లక్షల కోట్లకు రెట్టింపు చేస్తామని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. దీని ద్వారా ప్రతి గుజరాతీకి, ప్రతి భారతీయుడికి అపారమైన ఉపాధి, జీవనోపాధి, మరింత సంపద లభిస్తుందన్నారు.

‘మోడీ ఎరా’పై ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించినఈ ఈ కార్యక్రమ వేదికపై అంబానీ మాట్లాడుతూ.. మనదేశ నాగరిక విశ్వాసాన్ని, లక్ష్య స్ఫూర్తిని పునఃస్థాపించిన ఘనత ప్రధానమంత్రి మోడీకే దక్కుతుందని అంబానీ అన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో మనం ఈ రోజు చూస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ప్రధాని మోడీ దార్శనికత రాబోయే 50 ఏళ్లు, ఆ తర్వాత కూడా దేశ గమనాన్ని పునర్నిర్మించిందని తెలిపారు.

భారత్‌ను సామర్థ్యం కలిగిన దేశం నుంచి సమర్థవంతమైన దేశంగా, ఆకాంక్షల నుంచి ఆచరణ వైపునకు, అనుసరించే దశ నుంచి ప్రపంచ శక్తిగా మారిన దేశంగా 'మోడీ ఎరా' చరిత్ర సృష్టించిందని అంబానీ ప్రశంసించారు.

‘అజేయమైన రక్షణ కవచం’

ఈ సందర్భంగా ప్రపంచ అనిశ్చితి, భౌగోళిక రాజకీయ మార్పులను ప్రస్తావిస్తూ, మోడీ నాయకత్వం కారణంగా భారత్ దేశం వెలుపల సవాళ్ల నుంచి సురక్షితంగా ఉందని అంబానీ అన్నారు. ఇందుకు ప్రధానంగా భారత్‌కు 'నరేంద్ర భాయ్ మోడీ అనే అజేయమైన రక్షణ కవచం ఉంది' అని ముఖేష్ అంబానీ పొగడ్తలతో ముంచెత్తారు.

గుజరాత్ తమ కంపెనీ గుర్తింపు, వృద్ధికి కేంద్రమన్న అంబానీ, రిలయన్స్‌కు గుజరాత్ కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు. గుజరాత్ సంస్థ ఆత్మ అని, రిలయన్స్ ఒక గుజరాతీ కంపెనీ అని అన్నారు.

2036 ఒలింపిక్స్ బిడ్‌కు మద్దతు

ఇదే సమయంలో అహ్మదాబాద్‌లో 2036 ఒలింపిక్ క్రీడలను నిర్వహించాలనే ప్రధానమంత్రి దార్శనికతకు మద్దతు ప్రకటిస్తూ, రాష్ట్ర ప్రభుత్వంతో ఒక నిర్దిష్ట భాగస్వామ్యాన్ని కూడా అంబానీ ప్రకటించారు. దీనికి మద్దతు ఇవ్వడానికి రిలయన్స్ ఫౌండేషన్ సిద్ధంగా ఉంది. రిలయన్స్ గుజరాత్ ప్రభుత్వంతో కలిసి నరన్‌పురాలోని వీర్ సావర్కర్ మల్టీ-స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్వహిస్తుందన్నారు.

Next Story