Reliance: సదరన్ హెల్త్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్

by S Gopi |

మన్నా బ్రాండ్ ప్రధానంగా మిల్లెట్-ఆధారిత, హెల్తీ ఫుడ్ విభాగంలో ఉత్పత్తులను అమ్ముతోంది.

Reliance: సదరన్ హెల్త్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఎఫ్ఎంసీజీ కంపెనీ రిలయన్స్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల తమిళనాడుకు చెందిన ఉదయమ్స్‌ ఆగ్రో ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అదే రాష్ట్రానికి చెందిన మరో కంపెనీని కొనుగోలు చేసింది. తమిళనాడుకే చెందిన మన్నా బ్రాండ్ మాతృసంస్థ సదరన్ హెల్త్ ఫుడ్స్‌ను కొనుగోలు చేసినట్టు రిలయన్స్ కన్స్యూమర్ మంగళవారం ప్రకటించింది. మన్నా బ్రాండ్ ప్రధానంగా మిల్లెట్-ఆధారిత, హెల్తీ ఫుడ్ విభాగంలో ఉత్పత్తులను అమ్ముతోంది. దీన్ని రిలయన్స్ సంస్థ సొంతం చేసుకోవడం ద్వారా ఫుడ్ అండ్ స్టేపుల్స్ విభాగంలో రిలయన్స్ కన్స్యూమర్ వ్యాపారాన్ని బలోపేతం చేసుకుంది. రెండు దశాబ్దాలకు పైగా మన్నా బ్రాండ్ హెల్తీ ఫుడ్ ప్రోడక్ట్స్‌ను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా కస్టమర్లు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, పోషకాహార ఉత్పత్తులను ఎక్కువగా కొంటున్నారు. దీంతో మిల్లేట్స్, మల్టీగ్రెయిన్ స్టేపుల్స్, ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఫంక్షనల్ ఫుడ్స్‌కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ కొనుగోలు ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో డిమాండ్ వృద్ధిని సూచిస్తోంది. ఈ కొనుగోలు ద్వారా కంపెనీ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ పోర్ట్‌ఫోలియో బలోపేతం అవుతూనే, కస్టమర్లకు పోషక విలువలు ఉన్న ఉత్పత్తులను అందించడానికి వీలవుతుందని రిలయన్స్ కన్స్యూమర్ డైరెక్టర్ టి కృష్ణకుమార్ వెల్లడించారు.

Next Story