India-US: అమెరికా పరస్పర సుంకాలు భారత్‌కు పెద్దగా హాని చేయకపోవచ్చు: జీటీఆర్ఐ

by S Gopi |   (  Updated:2025-02-14 16:00:40  IST  )

రెండు దేశాల ఎగుమతుల్లో వ్యత్యాసాలు ఉన్నందున, భారత్‌కు పెద్దగా హాని కలిగించే అవకాశం లేదని జీటీఆర్ఐ తెలిపింది

India-US: అమెరికా పరస్పర సుంకాలు భారత్‌కు పెద్దగా హాని చేయకపోవచ్చు: జీటీఆర్ఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: పరస్పర సుంకాల విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటనతో వాణిజ్యంలో అనిశ్చిత వాతావరణాన్ని ఏర్పడింది. భారత్‌ మిత్ర దేశమైనప్పటికీ, పరస్పర పన్నుల విషయంలో వెనకడుగు వేయబోమని ట్రంప్ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల ఎగుమతుల్లో వ్యత్యాసాలు ఉన్నందున, యూఎస్ ప్రభుత్వ చర్య భారత్‌కు పెద్దగా హాని కలిగించే అవకాశం లేదని ప్రముఖ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(జీటీఆర్ఐ) శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ఉదాహరణకు, పిస్తాపప్పులపై అమెరికా 50 శాతం పరస్పర సుంకాలను వసూలు చేస్తే, భారత్ నుంచి పిస్తాపప్పుల ఎగుమతులు లేనందున ప్రభావం ఉండదు. అయితే, భారత్‌కు అమెరికా ఎగుమతి చేసే 75 శాతం వస్తువులపై సగటు సుంకం 5 శాతం కంటే తక్కువగా ఉందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. దీనికి విరుద్ధంగా, టెక్స్‌టైల్స్, గార్మెంట్స్, ఫుట్‌వేర్ లాంటి అనేక శ్రమతో కూడుకున్న వస్తువులపై భారత్ అధిక యూఎస్ సుంకాలను ఎదుర్కొంటోంది. వాటిలో చాలా ఉత్పత్తులపై 15-35 శాతం పన్ను అమలవుతోంది.

వాషింగ్టన్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాణిజ్య లోటును తగ్గించేందుకు భారత్ అమెరికా నుంచి మరిన్ని చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్‌వేర్‌లను కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అయితే పరస్పర సుంకాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పరస్పర సుంకాల గురించి ఏప్రిల్‌లో ప్రకటించవచ్చని అంచనా. ఇప్పటికే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాన్ని అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయం పరస్పర సుంకం పరిధిలోకి రాదు. పరస్పర సుంకం నిర్దిష్ట ఉత్పత్తులకు లేదా మొత్తం అన్ని రంగాల ఉత్పత్తులకూ వర్తిస్తుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని జీటీఆర్ఐ పేర్కొంది.

ఫిబ్రవరి 13 నాటి వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం, 'వ్యవసాయ వస్తువులపై అమెరికా సగటున మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్ఎన్) సుంకం 5 శాతం విధిస్తోంది. కానీ భారత్ సగటు ఎంఎఫ్ఎన్ టారిఫ్ 39 శాతంగా ఉంది. అలాగే, భారత్ అమెరికా మోటార్ సైకిళ్లపై 100 శాతం సుంకాన్ని వసూలు చేస్తుంది, అయితే తాము భారతీయ మోటార్ సైకిళ్లపై 2.4 శాతం సుంకాన్ని మాత్రమే వసూలు చేస్తున్నామని' అని పేర్కొంది. ఈ నేపథ్యంలో పారదర్శకంగా నిర్ణయం తీసుకునేందుకు ఉత్పత్తి లేదా రంగాన్ని అమెరికా తప్పనిసరిగా ఎంచుకోవాలని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. లేకుంటే, ఎంఎఫ్ఎన్ టారిఫ్ కోతలపై అమెరికా ప్రయత్నాలన్నీ అతిపెద్ద పారిశ్రామిక వస్తువుల సరఫరాదారుగా ఉన్న చైనాకు లాభదాయకంగా మారుతాయని అన్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో అమెరికా రెండవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. మొత్తం రూ. 7,15,968 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. అందులో రూ. 4,58,915 కోట్ల విలువైన ఎగుమతులు, రూ. 2,57,075 కోట్ల విలువైన దిగుమతులు ఉన్నాయి. రూ. 2,57,075 కోట్ల విలువైన వాణిజ్య మిగులు ఉంది. 2021-24 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత్‌తో వాణిజ్య మిగులు ఉన్న కొన్ని దేశాలలో అమెరికా ఒకటి.

Next Story