RBI: పరిస్థితులను బట్టే రేట్ల తగ్గింపు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

by S Gopi |

ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) కీలక రెపో రేటును క్రమంగా తగ్గిస్తూ వస్తోంది

RBI: పరిస్థితులను బట్టే రేట్ల తగ్గింపు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా వడ్డీ రేట్ల తగ్గింపు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు దఫాలుగా కీలక రెపో రేటులో కోత విధించిన ఆర్‌బీఐ మరింత తగ్గిస్తుందనే అంచనాలపై ఆయన స్పందించారు. తదుపరి రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను గమనిస్తామని, దాని ఆధారంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఆర్థికవ్యవస్థ వృద్ధితో పాటు ధరల స్థిరత్వం కూడా ముఖ్యమని, అందుకనుగుణంగానే పరిస్థితులను గమనిస్తామని అన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుండటంతో ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) కీలక రెపో రేటును క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్‌బీఐ 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది భవిష్యత్తులో రేటును తగ్గించేందుకు లేదా పెంచేందుకు వెసులుబాటును కల్పిస్తోంది. బుధవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. ద్రవ్యోల్బణ పరిస్థితులపై అంతర్గతంగా అంచనాలు జరుగుతుంటాయని, 3 శాతం లోపు కొనసాగుతుందా లేదా అనేది తెలియదని చెప్పారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూనే ఆర్థికవ్యవస్థకు ఎలాంటి విధాన రేటు అవసరమో దాన్ని ఎంపీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. వృద్ధి తక్కువగా ఉంటే విధాన రేట్లను తగ్గించవచ్చు. దానికోసం మరికొంత వేచి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వృద్ధి కంటే ద్రవ్యోల్బణమే ముఖ్యమని ఎవరూ చెప్పలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story