RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేట్లు యథాతథం

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 05:38:53  IST  )

బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించిన వేళ ఇవాళ జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి సమీక్ష (Monetary Policy Committee - MPC) సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక నిర్ణయాలను వెల్లడించారు.

RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేట్లు యథాతథం
X

దిశ, వెబ్‌డెస్క్: బలమైన ఆర్థిక శక్తిగా భారత్ ఆవిర్భవించిన వేళ ఇవాళ జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి సమీక్ష (Monetary Policy Committee - MPC) సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఈ మేరకు ఆర్‌బీఐ రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఇందులో ఎలాంటి మార్పు చేయబోమని స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల వరకు కోత విధించిన నేపథ్యంలో, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బట్టి ఈసారి నిలిపివేయాలని కమిటీ నిర్ణయించింది. స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీపై 5 శాతం, మార్జినల్ స్టాండిగ్ ఫెసిలిటీపై 5.50 శాతం, బ్యాంకు రేటుపై 5.50 శాతం, క్యాష్ రిజర్వ్ రేషియోపై వడ్డీ రేట్లు 3 శాతంగా ఉండనున్నట్లుగా వెల్లడించారు.

జీడీపీ, ద్రవ్యోల్బణం అంచనాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం జీడీపీ వృద్ధి అంచనాను మునుపటి 6.8 శాతం నుంచి 7.4కి పెంచింది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కోసం ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతం నుంచి 2 శాతాకి తగ్గించారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం సానుకూల అంశమని ఎంపీసీ కమిటీ తెలిపింది.

ఈఎంఐల్లో మార్పులు నిల్..

అదేవిధంగా మార్కెట్‌లో నగదు లభ్యతను పెంచడానికి రూ.1 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల (G-Sec) కొనుగోలు (OMO) చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల వల్ల భారత ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని, ఇది ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరించారు. ఇక వార్షిక బడ్జెట్ సమావేశాల తర్వాత తర్వాత జరిగిన ఈ మొదటి సమీక్షలో వృద్ధిని ప్రోత్సహిస్తూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేలా ఆర్‌బీఐ సమతుల్య నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతానికి హోమ్ లోన్, ఇతర రుణాల ఈఎంఐల్లో మార్పులు ఉండే అవకాశం లేదు.

RBI RepoRate: ఆర్బీఐ 'పాస్' బటన్.. ఎవరికి పండగ? ఎవరికి దండగ?

Next Story