RBI: తిరిగొచ్చిన 98.21 శాతం పెద్ద నోట్లు: ఆర్‌బీఐ

by S Gopi |

ఇప్పటికీ రూ.6,366 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉందని మంగళవారం ఆర్‌బీఐ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

RBI: తిరిగొచ్చిన 98.21 శాతం పెద్ద నోట్లు: ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా రూ. 2,000 విలువైన కరెన్సీ నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఉపసంహరించుకుని ఇప్పటికీ దాదాపు రెండేళ్లు కావస్తోంది. అయితే ఇప్పటికీ రూ.6,366 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్దే ఉందని మంగళవారం ఆర్‌బీఐ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణీలో ఉన్న వాటిల్లో 98.21 శాతం పెద్ద నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. 2023, మే 19న ఆర్‌బీఐ పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశంలో రూ. 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. మొదట అన్ని బ్యాంకుల్లో ఆయా నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేసేందుకు 2023, సెప్టెంబర్‌ 30 వరకు ఆర్‌బీఐ వీలు కల్పించింది. దాన్ని 2023, అక్టోబర్‌ 7 వరకు గడువును పొడిగించింది. ఆ తర్వాత నుంచి ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే పెద్ద నోట్లను డిపాజిట్, మార్పిడికి అవకాశం ఇస్తోంది. ఆర్‌బీఐ రీజనల్ ఆఫీసులకు వెళ్లలేని వారు ఇండియా పోస్ట్ ద్వారా కూదా దేశంలో ఏ పోస్టాఫీసు నుంచి అయినా తమ బ్యాంకు ఖాతాల్లో క్రెడిట్ అయ్యేలా ఆర్‌బీఐ ఆఫీసులకు పంపే అవకాశం ఉంది.

Next Story