RBI: 20 ఏళ్ల తర్వాత పట్టణ సహకార బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వనున్న ఆర్‌బీఐ

by S Gopi |

ప్రస్తుతం వీటిని కనీసం రూ. 300 కోట్ల మూలధనంతో సహా కఠినమైన నిబంధనలతో కొత్త లైసెన్సులను మళ్లీ అనుమతించాలని భావిస్తోంది.

RBI: 20 ఏళ్ల తర్వాత పట్టణ సహకార బ్యాంకులకు లైసెన్స్ ఇవ్వనున్న ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: 20 ఏళ్లకు పైగా విరామం తర్వాత, పట్టణ సహకార బ్యాంకుల (యూసీబీలు)కు లైసెన్సుల జారీని తిరిగి ప్రారంభించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రతిపాదించింది. కొత్త యూసీబీలు ఆర్థికంగా విఫలమవడంతో 2004లో లైసెన్సుల జారీని నిలిపివేశారు. ప్రస్తుతం వీటిని కనీసం రూ. 300 కోట్ల మూలధనంతో సహా కఠినమైన నిబంధనలతో కొత్త లైసెన్సులను మళ్లీ అనుమతించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తాజాగా ఆర్‌బీఐ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 13లోగా అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను, వాటాదారులను కోరింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్‌బీఐ బలహీనంగా ఉన్న యూసీబీలను విలీనం చేయడం లేదా పనితీరు సరిగా లేని బ్యాంకులను మూసివేయడం ద్వారా వాటి సంఖ్యను తగ్గించింది. అయినప్పటికీ, అనేక యూసీబీలు ఇప్పటికీ బలహీన పనితీరుతో కొనసాగుతున్నాయి. కొన్ని ఆర్‌బీఐ ఆంక్షల పరిధిలో ఉన్నాయి.

గతంలో జరిగిన చిన్న యూసీబీలే ఎక్కువగా నష్టాలను చూశాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద, మెరుగైన నిర్వహణ కలిగిన సహకార బ్యాంకులకు మాత్రమే లైసెన్సులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి యూసీబీలు సాధారణంగా మెరుగైన నిర్వహణ, సుదీర్ఘ అనుభవం, తక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త లైసెన్సుల కోసం ఆర్‌బీఐ కఠినమైన షరతులను సూచించింది. ఒక యూసీబీ కనీసం 10 ఏళ్లుగా పనిచేస్తూ ఉండాలి. గత 5 ఏళ్ల మంచి ఆర్థిక రికార్డును కలిగి ఉండాలి. రూ. 300 కోట్ల మూలధనం, కనీసం 12 శాతం మూలధన సమృద్ధి నిష్పత్తి, 3 శాతం కంటే తక్కువ మొండి బకాయిలు ఉండాలి. కాగా, 2025, మార్చి నాటికి, దేశంలో 1,457 యూసీబీలు ఉన్నాయి. వాటి మొత్తం ఆస్తుల విలువ రూ. 7.38 లక్షల కోట్లు, రూ. 5.84 లక్షల కోట్ల విలువైన డిపాజిట్లు ఉన్నాయి.

Next Story