RBI: ఆర్‌బీఐ రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్ల తగ్గించవచ్చు: ఎస్‌బీఐ రీసెర్చ్

by S Gopi |

ఇది ఆర్‌బీఐకి సరైన ఎంపికవుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది.

RBI: ఆర్‌బీఐ రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్ల తగ్గించవచ్చు: ఎస్‌బీఐ రీసెర్చ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఈ వారంలో నిర్వహించే ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక సూచించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇది ఆర్‌బీఐకి సరైన ఎంపికవుతుందని అభిప్రాయపడింది. సోమవారం మొదలయ్యే ఎంపీసీ సమావేశానికి సంబంధించి అక్టోబర్ 1న ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నిర్ణయాలను వెల్లడిస్తారు. వినియోగదారు ధరల సూచీ(సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టింది. అందువల్లే ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత ఆర్‌బీఐ ఇప్పటివరకు రెపో రేటును 1 శాతం మేర తగ్గించింది. ఆగస్టులో జరిగిన సమావేశంలో మాత్రమే యథాతథ స్థితిని ఎంచుకుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థపై అమెరికా టారిఫ్, ఇతర భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావాన్ని అంచనా వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో ఆర్‌బీఐ మరో 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించడం సమంజసమేనని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది.

ప్రస్తుత వాతావరణం రేటును తగ్గించేందుకు సానుకూలంగా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 ద్వారా పన్నులను తగ్గించడంతో ద్రవ్యోల్బణం 4 శాతం కంటే చాలా దిగువకు చేరుకుంటుంది. అయితే, ప్రాథమికంగా అంచనా వేయడం మాత్రమే కాదు, వృద్ధి స్థిరంగా 6.5 శాతం కంటే ఎక్కువగా ఉంటుందని నమ్మకం ఉంది. కాబట్టి అమెరికా టారిఫ్ ప్రభావం తర్వాత కూడా ఈ మేర కీలక రేట్లలో తగ్గింపుతో ముప్పు ఉండకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ వెల్లడించారు. పెరుగుతున్న బంగారం ధరల ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, అదనపు డిమాండ్ ఈ ఒత్తిడి ప్రధాన ద్రవ్యోల్బణంపై తక్కువగా ఉండవచ్చు. అంతేకాకుండా ఈ ఏడాది 50 బేసిస్ పాయింట్ల కోతలతో పాటు, అమెరికా ఫెడ్ కూడా 25 బేసిస్ పాయింట్ల రేట్ల కోత కారణంగా ఆర్‌బీఐకి ఇది వెసులుబాటుగానే ఉంటుందని క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మకీర్తి జోషి పేర్కొన్నారు.

Next Story