- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల ప్రసక్తే లేదు
పాలసీ విధానంలోనూ తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నట్టు సంజయ్ మల్హోత్రా తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: యూపీఐ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించే ప్రతిపాదన లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం స్పష్టం చేశారు. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. యూపీఐ ప్లాట్‌ఫామ్‌లలో జరిగే లావాదేవీలకు కొంత మొత్తం ఫీజును వసూలు చేయాలనే అంశం తమ పరిశీలనలో లేదని, వినియోగదారులకు ఈ సదుపాయం ఉచితంగానే ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో అదనపు ఛార్జీలు ఉంటాయనే సందేహాలు వద్దని, డిజిటల్ చెల్లింపులు ఇప్పుడున్న తరహాలోనే కొనసాగుతాయని ఎంపీసీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వం, ఆర్‌బీఐ సంయుక్తంగా యూపీఐని జీరో కాస్ట్ ప్లాట్‌ఫామ్‌గానే కొనసాగించాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీల వాటా గణనీయంగా ఉంది, ఎప్పటికప్పుడు కొత్త రికార్డులతో లావాదేవీలు దూసుకెళ్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్స్ మార్కెట్‌గా భారత్ సమర్థవంతంగా ఉందని సంజయ్ మల్హోత్రా వివరించారు. గత కొంతకాలంగా యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈసారి కూడా వడ్డీ రేట్లు యథాతథం
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) మరోసారి కీలక రెపో రేటును స్థిరంగా ఉంచుతూ నిర్ణయించింది. మూడు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును 5.5 శాతం వద్దే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. పాలసీ విధానంలోనూ తటస్థ వైఖరిని కొనసాగిస్తున్నట్టు సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆర్‌బీఐ రెపో రేటును వరుస సమావేశాల్లో 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆగష్టు సమావేశంలోనూ స్థిర వైఖరినే అనుసరించిన తర్వాత ఇప్పుడు వరుసగా రెండోసారి అదే ధోరణిని అనుసరించింది. ఇందుకు ప్రధానంగా టారిఫ్ ప్రభావంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీసేలా అమెరికా విధించిన అధిక టారిఫ్‌లను తిప్పి కొడుతూ పన్ను తగ్గింపులతో పాటు ఇతర చర్యలు ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తాయి. జీఎస్టీ పన్ను తగ్గింపు ఫలితాల ప్రభావం ఈ ఏడాది ద్వితీయార్థంలో కనిపిస్తాయని మల్హోత్రా అభిప్రయపడ్డారు.
వృద్ధి మరింత మెరుగ్గా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 నుంచి 6.8 శాతానికి సవరించింది. సానుకూల పరిస్థితులు, తక్కువ ద్రవ్యోల్బణం, ద్రవ్య సడలింపుల ద్వారా ఆర్థిక వృద్ధి అంచనా స్థిరంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు మరింత పుంజుకుంటాయని తెలిపారు. త్రైమాసికాల పరంగా చూస్తే.. రెండో త్రైమాసికంలో 7 శాతం, మూడో త్రైమాసికంలో 6.4 శాతం, చివరి త్రైమాసికంలో 6.2 శాతం, 2026-27 తొలి త్రైమాసికంలో 6.4 శాతంగా ఆర్‌బీఐ అంచనా వేసింది.
ద్రవ్యోల్బణ అంచనాల్లో కోత
ఇటీవలి నెలల్లో ద్రవ్యోల్బణం అంచనాలకు మించి తగ్గిందని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు. ఈ ఏడాది సగటు ప్రధాన ద్రవ్యోల్బణ అంచనాను జూన్‌లో అంచనా వేసిన 3.7 శాతం, ఆగస్టులో 3.1 శాతం నుంచి 2.6 శాతానికి సవరించారు. ఆహార పదార్థాల ధరలు గణనీయంగా తగ్గడం, జీఎస్టీ రేట్ల కోతలే ద్రవ్యోల్బణంలో ఈ పతనానికి ప్రధాన కారణం. మొత్తంగా 2025-26లో ద్రవ్యోల్బణ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. వాస్తవ ఫలితాలు మా అంచనాల కంటే గణనీయంగా తగ్గాయి. మెరుగైన సరఫరా, ప్రభుత్వం చర్యలు ఇందుకు మరింత దోహదపడుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు.






