RBI: హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయా? ఆర్బీఐ ఏం చెప్పింది

by Vennela |

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదిలో వరుసగా రెండోసారి రెపో రేటును తగ్గించింది.

RBI: హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయా? ఆర్బీఐ ఏం చెప్పింది
X

దిశ, వెబ్ డెస్క్: RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదిలో వరుసగా రెండోసారి రెపో రేటును తగ్గించింది. బుధవారం 25 బేసిస్ పాయింట్ల తగ్గించడంతో రెపో రేటు 6శాతం చేరింది. ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఏప్రిల్ 7న మొదలైన 3 రోజుల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్యాంకు వడ్డీల భారం తగ్గుతుందని ప్రజలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఆర్బీఐ రెపోరేటు తగ్గించినా సరే ఆ ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు అందిస్తున్నాయా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనంతరం గవర్నర్ మల్హోత్రా మాట్లాడారు. మేము ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించాము. అందరు కమిటీ సభ్యులు రెపోరేటును 6శాతానికి తగ్గించేందుకు అంగీకరించారని అన్నారు. 2024 డిసెంబర్ లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన హయాంలో వరుసగా రెండోసారి రెపోరేటు తగ్గించడం గమనార్హం. రెపోరేటు అంటే ఆర్బీఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీరేటు. అది తగ్గినప్పుడు, బ్యాంకులు మరింత తక్కువ వడ్డీకి లోన్స్ తీసుకోవచ్చు. ఆర్బీఐ నుంచి ఎక్కువగా డబ్బు పొందే అవకాశం లభిస్తుంది. వాస్తవానికి రెపోరేటు తగ్గినప్పుడు బ్యాంకులు తమ కస్టమర్లకు హోంలోన్స్ వంటి వాటిపై వడ్డీలు తగ్గించాలి.

2019 అక్టోబర్ నాటి నియమం ప్రకారం చాలా హోంలోన్స్ రెపోరేటుకు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆర్బిఐ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పుడు అదే మొత్తంలో హోంలోన్ వడ్డీ తగ్గుతుంది. ఈ మేరకు బ్యాంకులు వడ్డీ రేట్లు సవరించినప్పుడు కొత్త రుణగ్రహీతలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే హోంలోన్ తీసుకుని ఉంటే లోన్ రీసెట్ అయ్యే సమయంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్రతిమూడు లేదా ఆరు నెలలకు జరుగుతుంది. తక్కువ వడ్డీరేటుతో ప్రతినెలా చెల్లించే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్ స్టాల్ మెంట్ తగ్గుతుంది. లేదా మొత్తం మీద తక్కువ వడ్డీ చెల్లిస్తారు.

Next Story