RBI: 4.61 ఎకరాల స్థలాన్ని రూ. 3,472 కోట్లకు కొన్న ఆర్‌బీఐ

by S Gopi |

ఇది ప్రస్తుత ఏడాదిలోనే అత్యధిక మొత్తానికి కొన్న స్థలంగా నిలిచిందని రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి.

RBI: 4.61 ఎకరాల స్థలాన్ని రూ. 3,472 కోట్లకు కొన్న ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ మొత్తం వెచ్చించి భూమి కొనుగోలు చేయడం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశమైంది. సౌత్ ముంబైలోని నారీమన్ ప్రాంతంలో మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన 4.61 ఎకరాల భూమి కోసం ఆర్‌బీఐ రూ. 3,472 కోట్ల రికార్డు ధరకు కొన్నది. దీంతో ఇది ప్రస్తుత ఏడాదిలోనే అత్యధిక మొత్తానికి కొన్న స్థలంగా నిలిచిందని రియల్ ఎస్టేట్ వర్గాలు వెల్లడించాయి. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ యాక్సెస్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం.. సెప్టెంబర్ 5న ఈ లావాదేవీ కోసం ఆర్‌బీఐ రూ.208.3 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించింది. ఈ స్థలాన్ని సొంత కార్యాలయ వినియోగంతో పాటు వాణిజ్య ప్రయోజనాల కోసం కొనుగోలు చేసినట్టు ఆర్‌బీఐ పేర్కొంది. బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ హెడ్‌క్వార్టర్లకు దగ్గరలో ఉన్న ఈ స్థలాన్ని మొదట వేలం వేయాలని మెట్రో రైల్ భావించింది. కానీ ఆర్‌బీఐ తన హెడ్‌క్వార్టర్స్‌ను విస్తరించాలని భావించడం, ఈ స్థలంపై ఆసక్తి చూపడంతో వేలానికి సంబంధించిన టెండర్ రద్దయింది. ప్రస్తుతం ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం దక్షిణ ముంబైలోని ఫోర్ట్‌లో ఉంది. తాజా భూమి కొనుగోలు ద్వారా ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్‌బీఐ ఆస్తులను మరింత విస్తరించింది. ఇప్పటికే మింట్ రోడ్, మరికొన్ని చోట్ల సెంట్రల్ బ్యాంకుకు స్థిరాస్తులు ఉన్నాయి.

Next Story